Vijay Deverakonda:వినాయక చవితి రాబోతున్న నేపథ్యంలో అభిమానులకు సినీ ప్రేక్షకులకు ప్రజలకు సినీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం నుండి సీడ్ గణేషుడి (విత్తన గణపతి) ప్రతిమని అందుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ సీడ్ గణేషుడి ఉపయోగాలను అభిమానులతో పంచుకున్నారు.
సీడ్ గణపతిని అందుకున్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ” నగరాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన మట్టి విగ్రహాలను , విత్తన విగ్రహాలను ఉపయోగించండి. పండుగ ముగిసిన తర్వాత ఆ విగ్రహం ద్వారా ఒక మొక్క ఎదుగుతుంది. భక్తితో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. దయచేసి ఎవరూ కూడా కలర్స్ తో నింపిన వినాయకుడిని ఉపయోగించకుండా.. కేవలం మట్టి లేదా విత్తనాలతో తయారుచేసిన విగ్రహాలను మాత్రమే ఉపయోగించండి. పర్యావరణాన్ని కాపాడండి” అంటూ పిలుపునిచ్చారు విజయ్ దేవరకొండ.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ పర్యావరణ రహిత కార్యక్రమానికి విజయ్ దేవరకొండ తనవంతు మద్దతు పలికారు. ఈ సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మొక్కలు నాటడం అనేది కేవలం ఎంపిక మాత్రమే కాదు. అది అవసరం. మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పేరుపొందిన హరితహారం స్ఫూర్తితో 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. “మూడు మొక్కలు నాటాలి.. వాటిని మూడేళ్లు పెంచాలి.. మరో ముగ్గురిని నామినేట్ చేయాలి ” అనే ఫార్ములా తో ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కొనసాగుతోంది . ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారుగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటాము. పండుగను కేవలం వేడుకగా కాకుండా.. పర్యావరణ ఉద్యమంగా మార్చే సీడ్ గణేష్ కార్యక్రమాన్ని పౌరులు, హౌసింగ్ సొసైటీలు , ఆలయ కమిటీలు స్వీకరించాలని” గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోరుతోంది.
ALSO READ:8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!
ఇకపోతే ఇటీవల సీడ్ గణపతిని సొంతం చేసుకున్న చిరంజీవి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను చిరంజీవి ఆదివారం తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..” గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఒక యజ్ఞం లా భావించి ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహిస్తున్న సంతోష్ కుమార్ ను అభినందించారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా పండుగ ఉత్సాహంతో పాటు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతున్నాయని” ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటూ సీడ్ గణేషుడిని పూజించాలంటూ పిలుపునిస్తున్నారు.