Ravi Teja:‘ఇరుముడి’ ట్రైలర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు బాగా పరిచయమైన భీమవరం గురించి మాట్లాడటంతో అక్కడున్న వాళ్లంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా తన చదువు రోజులకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
భీమవరం అంటే తనకు చాలా ప్రత్యేకమైన ఊరు అని రవితేజ చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంతో తనకు అవినాభావ సంబంధం ఉందని చెబుతూ, కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు ఎనిమిది నెలల పాటు భీమవరంలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో తాను ఏం చేశానో చెప్పినప్పుడు మాత్రం అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఆ ఎనిమిది నెలలు దాదాపుగా సినిమాలు చూడటానికే ఉన్నానని నవ్వుతూ చెప్పారు.
‘అయితే నాకు స్కూల్ లేదా?’ అని ఎవరైనా అనుకోవచ్చని కూడా తనదైన స్టైల్‌లో రవితేజ చెప్పడంతో ఈవెంట్‌లో నవ్వులు పూశాయి. తాను మెట్రిక్యులేషన్ పరీక్షలో ఫెయిల్ అయి, మళ్లీ ఎగ్జామ్ రాయడానికి భీమవరం వచ్చినట్టు చెప్పుకొచ్చారు. చదువు విషయంలో అప్పట్లో పెద్దగా సీరియస్‌గా లేకపోయినా, సినిమాల విషయంలో మాత్రం ఫుల్ సీరియస్ అన్నట్టుగా రవితేజ చెప్పిన ఈ ఫ్లాష్‌బ్యాక్ ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
అసలు తనకు భీమవరంతో ఈ అనుబంధం ఎలా వచ్చిందో కూడా రవితేజ వివరించారు. తన తాతయ్య, నానమ్మ ఇక్కడే ఉండేవారని, డీఎన్ఆర్ కాలేజ్ దగ్గర వాళ్ల నివాసం ఉండేదని చెప్పారు. అందుకే భీమవరం తనకు కేవలం ఒక ప్రాంతం కాదని, చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడిన ప్లేస్ అని ఆయన మాటల్లోనే అర్థమైంది.
ఇక భీమవరం గురించి రవితేజ చెప్పిన మరో మాట కూడా అక్కడున్న వాళ్లకు తెగ నచ్చింది. ఈ ఊరికి ఒక ఎక్సలెంట్ వైబ్ ఉందని ఆయన అన్నారు. భీమవరం ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అక్కడి వంటకాలకే ప్రత్యేకమైన క్రేజ్ ఉందని తన మాటల్లో చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. భీమవరం వాళ్లు మాట్లాడే మాటల్లో కూడా ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుందని రవితేజ చెప్పడం అక్కడి ప్రేక్షకులను మరింత ఖుషీ చేసిందనే చెప్పాలి.
భీమవరం పేరు చెబితే ఫుడ్, సినిమాలతో పాటు సంక్రాంతి సందడి, కోడిపందాలు కూడా గుర్తొస్తాయి. ఇదే విషయాన్ని రవితేజ కూడా ప్రస్తావించారు. కోడిపందాలకు రావాలని తనకు ఉందని, ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పడంతో ఈవెంట్‌లో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ‘మాస్ మహారాజా ఈసారి భీమవరం సంక్రాంతి బరిలోకి వస్తున్నాడా?’ అంటూ సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది.
‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘బలుపు’, ‘క్రాక్’, ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలతో రవితేజ తన సత్తా ఏంటో చూపించాడు.ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మాస్ యాక్షన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక ‘ఇరుముడి’ విషయానికి వస్తే.. రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై ట్రైలర్‌తో మరింత ఆసక్తి పెరిగింది. ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శివ నిర్వాణ పేరు కూడా ఈ ప్రాజెక్ట్ చుట్టూ క్యూరియాసిటీ పెంచుతోంది.
ALSO READ:తెలుగు హీరోలతో సినిమాలు ఎందుకు చేయట్లేదు ?.. వెంకీ చెప్పిన కారణం ఇదే!
చూడాలి మరి రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తున్న ‘ఇరుముడి’ సినిమాతో ఈ మాస్ మహారాజ్ ఎలాంటి సక్సెస్ కొడతాడో!