War Anime Movie on OTT: యుద్ధం మొదలైతే దేశాలు గెలవొచ్చు… ఓడిపోవచ్చు. కానీ ఆ యుద్ధం మధ్యలో చిక్కుకున్న చిన్నారుల జీవితాలు ఏం అవుతాయి ? తల్లిని కోల్పోయిన ఓ 14 ఏళ్ల అన్న, తన నాలుగేళ్ల చెల్లిని కాపాడుకోవడానికి ప్రపంచంతోనే పోరాడాల్సి వస్తే ? తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, అండగా నిలిచే మనుషులు లేకపోతే ఆ చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుంది ? అన్నాచెల్లెళ్ల అనుబంధం, ఆకలి, యుద్ధం, అనాథత్వం, నిస్సహాయతను గుండెల్ని పిండేసేలా చూపించిన జపనీస్ యానిమేషన్ క్లాసిక్ ‘గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్’ (Grave of the Fireflies). స్టూడియో గిబ్లి నుంచి వచ్చిన ఈ సినిమా యానిమేషన్ అంటే కేవలం పిల్లల కోసం చేసే వినోదం కాదని నిరూపించే అద్భుతమైన భావోద్వేగ కథ. మరి కన్నీళ్ళు పెట్టించే ఈ బంగారం లాంటి సినిమాలు ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.
రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్‌లోని కోబ్ నగరంలో కథ స్టార్ట్ అవుతుంది. ఆకాశంలో యుద్ధ విమానాలు… కింద బాంబుల వర్షం… ఎటు చూసినా భయానక పరిస్థితులు. అలాంటి సమయంలో 14 ఏళ్ల సీటా తన నాలుగేళ్ల చెల్లెలు సెట్సుకోతో కలిసి తల్లిదండ్రులతో జీవిస్తుంటాడు. యుద్ధం గురించి పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా లేని సెట్సుకోకు మాత్రం తన కుటుంబంతో కలిసి ఉండటమే ప్రపంచం.
కానీ ఒక భారీ బాంబు దాడి ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా ఛిన్నాభిన్నం చేస్తుంది. వారి ఇల్లు ధ్వంసమవుతుంది. తల్లి తీవ్రంగా గాయపడుతుంది. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలతో సీటా, సెట్సుకో ఇద్దరూ చిన్న వయసులోనే తల్లిని కోల్పోతారు. ఆర్మీలో పనిచేస్తున్న తండ్రి నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో, ఈ అన్నాచెల్లెళ్ల జీవితంలో ఒక్కసారిగా చీకటి మొదలవుతుంది.
తన చెల్లెలికి తానే తల్లిలా మారాలని సీటా నిర్ణయించుకుంటాడు. మొదట బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నిస్తారు. కానీ యుద్ధకాల పరిస్థితుల్లో అక్కడ కూడా వారికి ఆశించినంత ఆదరణ దక్కదు. ఆహారం కొరత, కుటుంబాల మధ్య పెరుగుతున్న ఒత్తిడి, పరిస్థితులపై అసహనం… ఇవన్నీ సీటాను ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేస్తాయి.
చివరకు సీటా, సెట్సుకో ఒక పాత బంకర్‌ను తమ సొంత ప్రపంచంగా మార్చుకుంటారు. బయట ప్రపంచంలో యుద్ధం కొనసాగుతుంటే… ఆ చిన్న చీకటి ప్రదేశంలో అన్నాచెల్లెళ్లు తమకంటూ ఓ చిన్న జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాలను కూడా సెట్సుకో ఎంతో అమాయకంగా ఆస్వాదిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో మిణుగురుపురుగులు వెలుగులు విరజిమ్ముతున్న దృశ్యాలను చూసి ఆ చిన్నారి సంతోషపడటం కథలో ఎంతో అందమైన క్షణంగా నిలుస్తుంది. యుద్ధం ఎంత భయంకరమైనదైనా… పిల్లల మనసులోని అమాయకత్వం మాత్రం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ సన్నివేశాలు గుర్తుచేస్తాయి.
కానీ ఆ చిన్న సంతోషాలు ఎక్కువకాలం నిలబడవు. తినడానికి సరిపడా ఆహారం లేకపోవడంతో సీటా, సెట్సుకో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంది. చెల్లెలి ఆకలి తీర్చేందుకు సీటా చేయని ప్రయత్నం ఉండదు. చివరకు బతకడానికి తప్పనిసరి పరిస్థితుల్లో అతను తీసుకునే నిర్ణయాలు అతని జీవితాన్ని మరింత కఠినంగా మారుస్తాయి. మరోవైపు యుద్ధం సెట్సుకోకు పూర్తిగా అర్థం కాదు. ఆమెకు కావాల్సింది అన్నతో కలిసి ఉండటం, కొంత తిండి తినడం, అప్పుడప్పుడు ఆడుకోవడం మాత్రమే. కానీ పెద్దలు సృష్టించిన యుద్ధానికి మూల్యం చెల్లించాల్సి వచ్చేది మాత్రం ఇలాంటి చిన్నారులే. తినడానికి ఆహారం లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం, చుట్టూ కనిపించే విధ్వంసం.. ఇవన్నీ ఆ చిన్నారి జీవితాన్ని నెమ్మదిగా విషాదంలోకి నెట్టేస్తాయి.
సెట్సుకో ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో సీటా ఆందోళన మరింత పెరుగుతుంది. చెల్లెలిని కాపాడుకోవడానికి అతను చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ యుద్ధం సృష్టించిన పరిస్థితులు వారి ముందు నిలిచిన అతిపెద్ద శత్రువుగా మారతాయి. ఇక్కడి నుంచి కథ మరింత హృదయ విదారకంగా మారుతుంది. ఓ అన్న తన చెల్లెలిని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్లగలడు ? ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా మారినప్పుడు అతని ప్రేమ ఎంతకాలం ఆమెను కాపాడగలదు ? చివరకు సీటా, సెట్సుకోల జీవితాలకు యుద్ధం ఎలాంటి ముగింపు ఇచ్చింది ? అనేదే ఈ సినిమాలో మనసును కలచివేసే ప్రధాన అంశం.
ఇసావో తకహత దర్శకత్వం వహించిన ఈ చిత్రం అకియుకి నొసాకా రాసిన సెమీ-ఆటోబయోగ్రాఫికల్ నవల ఆధారంగా తెరకెక్కింది. యుద్ధాన్ని కేవలం సైనికుల కోణంలో కాకుండా… దాని వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అనుభవించే బాధను చూపించిన విధానం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ‘గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్’ సాధారణ యానిమేషన్ సినిమా కాదు. అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆకలి, యుద్ధం, నిస్సహాయతను ఎంతో సహజంగా చూపించి గుండెల్ని పిండేసే కథ. ఎమోషనల్ సినిమాలు, యుద్ధ నేపథ్య కథలు, క్లాసిక్ యానిమేషన్ చిత్రాలను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. కానీ ఈ మాస్టర్ పీస్ తెలుగులో లేదు.
Read Also: నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం