Shanmukh Wedding: షణ్ముఖ్ జస్వంత్ (షణ్నూ)…ఎమోషనల్ షార్ట్ ఫిలిమ్స్,క్రేజీ వెబ్ సిరీస్ లతో తెలుగు డిజిటల్ వరల్డ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ క్రేజీ యూట్యూబర్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ‘సూర్య’ వంటి సాలిడ్ హిట్ అయిన వెబ్ సిరీస్‌లతో యూత్ ఐకాన్‌గా మారిన షణ్ముఖ్.. బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచి బుల్లితెరపై కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు కూడా. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, పర్సనల్ లైఫ్‌లో జరిగిన కొన్ని ఒడిదుడుకుల వల్ల నిరంతరం వార్తల్లో నిలిచే షణ్ముఖ్.. ఇప్పుడు తన జీవితంలో మరో చాప్టర్ ని మొదలెట్టేశాడు.
అవును..ఎలాంటి హడావుడి లేకుండా, మీడియా కంటికి చిక్కకుండా సైలెంట్‌గా వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయి మెళ్ళో మూడు మూళ్ళు వేశాడు.గతంలో ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయనతో నడిపిన సుదీర్ఘ ప్రేమాయణం, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల వారిద్దరి బ్రేకప్ సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టేస్తూ, షణ్ముఖ్ తన లైఫ్‌ను రీస్టార్ట్ చేశాడు.
also read :వెంకీ-అనిల్ రావిపూడి సినిమా పేరిట నకిలీ కాస్టింగ్ కాల్స్.. మోసపోవద్దంటూ మేకర్స్ హెచ్చరిక!
కొన్ని రోజుల క్రితమే వైష్ణవితో రహస్యంగా నిశ్చితార్థం ముగించుకున్న ఈ స్టార్ యూట్యూబర్.. ఆ వెంటనే పెళ్లి కాకుండానే కాబోయే భార్యతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పట్లోనే వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ తాజాగా వీరి వివాహ వేడుకకు సంబంధించిన అసలు సిసలైన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది అత్యంత సన్నిహిత స్నేహితుల సమక్షంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సాంప్రదాయ పట్టు వస్త్రాలలో మెరిసిపోతున్న ఈ కొత్త జంటను చూసి నెటిజన్లు లక్ష్మీనారాయణుల జోడీలా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి షణ్ముఖ్ తన పెళ్లికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ను అధికారికంగా ఎక్కడా పంచుకోలేదు. కానీ, వీరి క్లోజ్ ఫ్రెండ్స్ ఈ వేడుకకు హాజరై, అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేయడంతో ఈ పెళ్లి మ్యాటర్ కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.
also read :గాయత్రి గుప్తా సెన్సేషనల్ వీడియో.. చావు అంచున ఉన్నానంటూ నటి కన్నీటి పర్యంతం!
ముఖ్యంగా ఈ పెళ్లి వీడియోలలో ‘జీలకర్ర బెల్లం’ పెట్టే శుభ ముహూర్తం సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుని, ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులతో కనిపిస్తున్న ఆ స్పెషల్ మూమెంట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ వంటి సిరీస్‌లతో డిజిటల్ స్క్రీన్‌పై అలరించిన షణ్ముఖ్, ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక ఇంటివాడై పోయాడు. ఈ క్రేజీ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, తోటి యూట్యూబర్లు మరియు టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.