Gayatri Gupta: గాయత్రి గుప్తా…సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడూ బోల్డ్ కంటెంట్‌తో, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వంతో వార్తల్లో నిలిచే గాయత్రి, ఈసారి కన్నీళ్లతో కనిపించడం సినీ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
గత కొన్ని నెలలుగా తాను తీవ్రమైన పానిక్ అటాక్స్ మరియు పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)తో నరకం అనుభవిస్తున్నానని, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదుర్కొన్న ఒక భయంకరమైన లైంగిక వేధింపుల సంఘటనే ఈ తీవ్ర మానసిక గాయానికి కారణమని చెప్తూ ఆమె సహాయం కోసం అర్థించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఫిదా సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మెప్పించిన గాయత్రి గుప్తా, సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలపై ఎప్పుడూ గళం విప్పుతూనే ఉంటారు. అయితే, ఇప్పుడు ఆమె స్వయంగా చావు అంచుల్లో ఉన్నానంటూ చేసిన కామెంట్స్ చూస్తుంటే పరిస్థితి ఎలా తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.గుండెల్లో పేరుకుపోయిన బాధను, ఒత్తిడిని ఇక భరించలేకే ఈ వీడియో ద్వారా బయటపెడుతున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తాను తీవ్ర ఆందోళనలో ఉన్నానని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని, ఈ నరకం నుంచి బయటపడటానికి అత్యవసరంగా లీగల్ లేదా థెరపీ సహాయం కావాలని ఆమె కోరారు.
also read :అయ్యగారికి అదృష్టం కలిసి వచ్చేనా.. ‘లెనిన్’ రిపేర్లు వర్కవుట్ అవుతాయా?
సహాయం కోసం తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని గాయత్రి ఈ వీడియోలో స్పష్టం చేశారు. ఇప్పటికే థెరపీ తీసుకుంటున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని, కనీసం మహిళా సంఘాలైనా అండగా ఉంటాయేమోనని ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ప్రతినిధులను సంప్రదించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. తనకు ఒక లాయర్ అవసరమా లేక సమర్థవంతమైన థెరపిస్ట్ అవసరమా అనేది కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నానని వాపోయారు. ఆన్‌లైన్‌లో మహిళా హక్కుల గురించి, అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పే సంస్థలన్నీ కేవలం డ్రామాలు ఆడుతున్నాయని, నిజానికి ఎవరికీ ఎవరి మీదా శ్రద్ధ లేదంటూ సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.అయితే పోస్ట్ చేసిన కాసేపటికే అకౌంట్ నుండి దీన్ని తొలగించడం గమనార్హం.
గతంలో కూడా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్‌పై, లైంగిక వేధింపులపై గాయత్రి గుప్తా బహిరంగంగానే పోరాడారు. పలు ఇంటర్వ్యూలలో సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను ధైర్యంగా ఎండగట్టిన హిస్టరీ ఆమెకుంది. అలాంటి ధైర్యశాలి అయిన నటి, నేడు నిరాశతో, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతూ కన్నీరు పెట్టుకోవడం నెటిజన్లను కదిలిస్తోంది.సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు, మానసిక నిపుణులు ఆమెకు అవసరమైన కౌన్సెలింగ్ మరియు లీగల్ సపోర్ట్ అందించడానికి ముందుకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒక నటిగా, సామాజిక స్పృహ ఉన్న మహిళగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి, ఈ గండం నుంచి త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
also read :పుష్ప-2 ఎఫెక్ట్..సంధ్య థియేటర్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లు అర్జున్