Toxic Pre Release event: మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో ప్రముఖ శాండిల్ వుడ్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం టాక్సిక్(Toxic ). కన్నడ , ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ్, మలయాళం, హిందీ భాషలలో డబ్బింగ్ వర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), తారా సుతారియా(Tara sutharia) , హుమా ఖురేషి(Huma Qureshi), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన రొమాంటిక్ వీడియోస్, పోస్టర్లు , గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆగస్టు 22 శనివారం చాలా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈవెంట్ ని వీక్షించడానికి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి సందడి చేశారు. ప్రాంగణం మొత్తం విద్యార్థుల కోలాహాలాలతో నిండిపోయింది. సందడి వాతావరణం నెలకొంది .స్టేజ్ పై అభిమానులు, విద్యార్థుల ఈలలు చప్పట్ల మధ్య యశ్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకుల కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అమ్మాయిలకి గాయాలు అవ్వగా.. వీళ్ళలో ఒకామె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇకపోతే అక్కడ సౌండ్ బార్ కూలిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొంతమంది అభిమానులు స్పీకర్ స్టాండ్ పైకి ఎక్కగా.. ఒక బృందం దానిపై విన్యాసాలు కూడా చేశారట. ఆ సమయంలో అదుపుతప్పి అకస్మాత్తుగా స్పీకర్ స్టాండ్ కూలిపోయింది. దాంతో దాని పైకి ఎక్కిన వారిలో కొంతమంది కిందపడి గాయాలైనట్లు సమాచారం. ఇక గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించగా అందుకు సంబంధించి ఫోటోలను అక్కడికి వచ్చిన ఆడియన్స్ తీశారు.పైగా అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
also read: ప్రథమార్ధంలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసిన తెలుగు చిత్రాలు!
ప్రమాదం గురించి తెలుసుకున్న యశ్ వెంటనే కొద్దిసేపు ఈవెంట్ ని నిలిపివేశారు. ముందుగా గాయపడిన అభిమానులకు తక్షణమే సహాయం చేయమని నిర్వాహకులను కోరారు. వేదికపై ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్ స్టాండ్ కూలిపోయింది. దాంతో తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి, వారు క్షేమంగా ఉన్నారా దయచేసి తనిఖీ చేయండి అంటూ అడిగారు. ఇంత జరిగినా కూడా మరికొంతమంది ఏమాత్రం ఆలోచించకుండా.. మిగతా స్పీకర్ స్టాండ్ ల పైకి ఎక్కడానికి ప్రయత్నించడాన్ని గమనించిన యశ్ తన ప్రసంగానికి విరామం ఇచ్చి వారి భద్రతా దృష్ట్యా కిందకు దిగమని కోరారు. ఇక గందరగోళం సద్దుమణిగిన తర్వాతే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి