Sujeeth:ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth ) విజన్ ఎలా ఉందో తాజాగా విడుదలైన ఓజీ (OG)ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా సాహో ( Sahoo)సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయన.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓజీ అంటూ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓజీ నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు సుజీత్ కి సంబంధించిన పలు విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సుజీత్.. తన జీవితంలో ఎదుర్కొన్న ఒక చేదు సంఘటనను కూడా అభిమానులతో పంచుకున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అప్పుడే అసలు కష్టం ఏంటో తెలిసింది..
సుజీత్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఒక మంచి ప్రేమ కథను రాసుకున్నాను. అయితే ఇదే నా తొలి చిత్రమైతే బాగుంటుందని కూడా అనుకున్నాను. అందుకే ‘రన్ రాజా రన్’ మూవీ కంటే ముందే నిర్మాతలకు ఈ కథ వినిపించా..అద్భుతం అన్నారు. రెండవ భాగం కోసం దాదాపు 5 నెలలు కష్టపడి మంచి వెర్షన్ రాసాను. అదే ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి సెకండ్ హాఫ్ వినిపిస్తే.. సూపర్.. స్టార్ట్ చేద్దామన్నారు.సంతోషంతో నేను బండిపై ఇంటికి బయలుదేరా.. మార్గం మధ్యలో ఫోన్ వచ్చింది. బండి పక్కకు ఆపి మరీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే.. వాళ్లు చూడమ్మా దీనికి ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉంది.. ఏదైనా వేరే కథ ఉంటే చెప్పు అన్నారు.. అంతే నా ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. రోడ్డు పక్కన కూర్చొని దాదాపు మూడు గంటల పాటు గుక్క తిప్పుకోకుండా ఏడ్చాను.
also read:OG Trailer : ఓజీ ట్రైలర్ అదిరిపోయింది… కానీ, ఒక్క మిస్టేక్ చేశారు
ఆయన ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో ఉన్నాను..
ఆ సమయంలో ఏం చేయాలో తెలియక వెన్నెల కిషోర్ (Vennela kishore)కి ఫోన్ చేశా.. అతనే నాకు కాస్త ధైర్యం ఇచ్చాడు. “నువ్వు షార్ట్ ఫిలిమ్స్ గంటలో రాయగలవు .. అలాంటిది సినిమాను ఒక్కరోజులో రాయలేవా ? “అంటూ నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ఆరోజు వెన్నెల కిషోర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్దాం అనుకున్నా.. బండి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.. ఒకవైపు జోరుగా వాన.. ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు. అలా జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు బండిని నెట్టుకుంటూ వర్షంలోనే వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు.. బాధ, కసి, కోపం, కన్నీళ్లు , నిరాశ అన్ని రకాల ఫీలింగ్స్ వచ్చేసాయి. ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చిందే ‘రన్ రాజా రన్’. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి..” ఒక కథ ఉంది..చెప్పమంటారా ?” అని అడిగాను. వెంటనే వాళ్లు సరే అన్నారు. అలా కథ మొత్తం రాసి తీసుకెళ్లా.. ఒకే చేశారు. అంతే ఇక అప్పటినుంచి నా కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది” అంటూ తెలిపారు. ఏది ఏమైనా వెన్నెల కిషోర్ ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పకనే చెప్పేశారు సుజీత్.