Percentage Controversy : ‘పర్సంటేజ్’ పంచాయితీ అటు తిరిగి ఇటు తిరిగి సునీల్ నారంగ్ రాజీనామాకి దారి తీసింది.యస్ …. ప్రముఖ ఎగ్జిబిటర్, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఉన్నపళంగా రాజీనామా చేయడం ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతుంది.అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఉనికే క్వశ్చన్ మార్క్ అయిన ఈ సమయంలో పాత ‘ఫిక్స్‌డ్ రెంటల్’ పద్ధతిని వదిలి ‘పర్సంటేజ్’ విధానంలోకి వెళ్లాలన్న డిమాండ్ ఇప్పుడు చిచ్చు రేపుతోంది.
వైరల్ అవ్వడం వెనుక పెద్ద కుట్ర
సింగిల్ స్క్రీన్ థియేటర్లను నడపడం రోజు రోజుకూ భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలని థియేటర్లలో వేయాలంటే పర్సంటేజీ ఇవ్వాల్సిందే అని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, నిర్మాతలు దీనిని అంగీకరించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
అయినప్పటికీ “పెద్ద సినిమాలకు భారీగా ఖర్చు పెట్టి థియేటర్లను సిద్ధం చేస్తున్నాం. కానీ, కలెక్షన్లు రాకపోయినా మేం భారీగా అద్దెలు కట్టాల్సి వస్తోంది. అదే పర్సంటేజ్ విధానం అయితే థియేటర్ల మనుగడ సాధ్యమవుతుంది. సింగిల్ స్క్రీన్లను బతికించుకోవాలంటే ఈ మార్పు తప్పనిసరి. పర్సంటేజ్ పద్ధతికి నిర్మాతలు ఒప్పుకుంటేనే థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తాం, లేదంటే లేదు!” అని తెలంగాణలోని ఎక్కువ శాతం ఎగ్జిబిటర్లు స్పష్టంగా, కరాఖండిగా తేల్చి చెపుతున్నారట .ఇక ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో, రాబోయే భారీ చిత్రం ‘పెద్ది’ రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలో పడిపోయారంతా .
అయితే గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు సునీల్ నారంగ్ మధ్యవర్తిత్వం వహించి సమస్యలను పరిష్కరించేవారు. కానీ ఈసారి ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ చేసిన ప్రకటన ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఛాంబర్ వర్గాలకు పంపిన తీరు, కనీసం కమిటీ సభ్యులకు సమాచారం లేకుండా సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి కూడా.
also read :జస్ట్ ‘నో’ చెప్పడమే పాపమా.. సింగర్ హత్య వెనుక బయటపడుతున్న భయంకర నిజాలు!
తనపై కొందరు వ్యక్తులు, నిర్దిష్ట వర్గాల ప్రయోజనాల కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చారని, అందుకే తాను తప్పుకుంటున్నానని సునీల్ నారంగ్ లేఖలో పేర్కొనడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జిబిటర్ల శ్రేయస్సు కోరుకునే సునీల్ నారంగ్ వంటి కీలక వ్యక్తి తప్పుకుంటే భవిష్యత్తులో ఇండస్ట్రీలో ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని టాలీవుడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
పర్సంటేజ్ విధానం ఒక లైఫ్ లైన్
ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉనికిని కోల్పోతున్న వేళ, ఈ పర్సంటేజ్ విధానం ఒక లైఫ్ లైన్ లాంటిదని ఎగ్జిబిటర్లు భావిస్తుండగా, నిర్మాతలు మాత్రం కమర్షియల్ గా అస్సల్ వర్కౌట్ కాదని మొండికేస్తున్నారు.అటు ‘పెద్ది’ వంటి భారీ చిత్రాల విడుదలకు ముందే ఇటువంటి కీలక మార్పులు చోటుచేసుకోవడం, ఆ తర్వాత సునీల్ నారంగ్ రాజీనామా చేయడం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
also read :మళ్లీ మొదలైన మున్నాభాయ్ మ్యాజిక్.. అర్షద్ వార్సీ, హిరాని కాంబోలో కొత్త సిరీస్!
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండస్ట్రీలోని కీలక వర్గాలు రెండుగా చీలిపోవడంతో, ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో మరియు దీనిని పరిష్కరించేందుకు అగ్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఏ మేరకు కాంప్రమైజ్ అవుతారో వేచి చూడాలి మరి.ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ రాజీనామా వ్యవహారం టాలీవుడ్ లోని ఇంటర్నల్ పాలిటిక్స్ ని బయటపెట్టిందని చెప్పడంలో సందేహం లేదు. రాబోయే గంటలు లేదా రోజుల్లో ఈ వివాదం ఒక కొలిక్కి రాకపోతే, థియేటర్ల బంద్ లేదా షోల నిలిపివేత వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం కూడా.
ఈ పర్సంటేజ్ పంచాయితీ ఎటు వైపు దారి తీస్తుందో
గతంలో కూడా సినిమా పరిశ్రమలో ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, అప్పట్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులందరూ కలిసి ఆయనను ఒప్పించి, రాజీనామాను ఆమోదించకుండా వెనక్కి తీసుకెళ్లేలా చేశారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందనే చెప్పాలి. ఏది ఏమైనా, టాలీవుడ్ గడపపై ఉన్న ఈ ‘పర్సంటేజ్’ అనే కత్తి ఇప్పుడు నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య మరింత దూరాన్నే పెంచుతుంది.ఒకవేళ సునీల్ నారంగ్ తన నిర్ణయంపై పునరాలోచించకపోతే లేదా కొత్త నాయకత్వం దీనిని ఎలా హ్యాండిల్ చేస్తుందనేదే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.చూడాలి ముదురుతున్న ఈ పర్సంటేజ్ పంచాయితీ ఎటు వైపు దారి తీస్తుందో !