Dancers association: గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ (TFTDDA)లో చెలరేగిన వివాదం ఇండస్ట్రీ పెద్దల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫిలిం ఫెడరేషన్, నిర్మాతల మండలి, ఆఖరికి చిరంజీవి (Chiranjeevi ), బాలకృష్ణ (Balakrishna) వంటి వారు కూడా రంగంలోకి దిగినా.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (Sumalatha) తన మాట తీరును మార్చుకోవడం లేదు అనే కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రఘు మాస్టర్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇక ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం కాస్త కోర్టు వరకు వెళ్ళింది. ఈ వివాదాన్ని పరిశీలించిన కోర్టు కీలక తీర్పు ఇవ్వడమే కాకుండా తదుపరి విచారణను వాయిదా వేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ వివాదం పై కూకట్ పల్లిలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసోసియేషన్ పేరుతో నకిలీ పత్రాలు, లెటర్ హెడ్లు, సృష్టించడానికి నిరోధించడం తోపాటు సెప్టెంబర్ 13న నిర్వహించాలనుకున్న జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ.. న్యాయస్థానం మధ్యంతర స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం వి.వి.సుమలతాదేవి (Sumalatha devi) అధ్యక్ష పదవికి 2025 నుండి 2027 కాల పరిమితికి ఎన్నుకోబడిన కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగుతున్నప్పటికీ.. కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా.. అసోసియేషన్ నిర్వహణను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.
ALSO READ:బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
బైలా నిబంధనల ప్రకారం.. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆగస్టు 30న అనధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి, కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని విమర్శించారు.. అంతటితో ఆగకుండా అసోసియేషన్ అధికారిక ఈ-మెయిల్ ఐడిని కూడా హ్యాక్ చేసి జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు ఫోర్జరీ లేఖలు పంపి, బ్యాంకు సంతకాలు మార్చుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఇకపోతే సభ్యుల సంక్షేమం కోసం కేటాయించిన సుమారు 4 కోట్ల రూపాయలు నిధులను అసోసియేషన్ భవిష్యత్తును కాపాడడానికి వెంటనే న్యాయపరమైన జోక్యం అవసరమని, బాధితుల తరఫున పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న ఇందిరా నగర్ లో ఉన్న హోటల్ అనుపమలో మరో సమావేశం నిర్వహించేందుకు ప్రతివాదులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు..ఈ మేరకు కోర్టు కి సమర్పించిన సాక్ష్యాధారాలు, పోలీసు ఫిర్యాదుల కాపీలను పరిశీలించిన జడ్జి శ్రీమతి కావ్యా జాడ.. ప్రతివాదుల చర్యలను ప్రాథమికంగా తప్పుపడుతూ ఆదేశాలు జారీ చేశారు. కే రాఘవేంద్ర , వై మెహర్ బాబాతో పాటు ఇతర ప్రతివాదులు సెప్టెంబర్ 13న ఎలాంటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అసోసియేషన్ ముద్రలు, లెటర్ హెడ్లు వాడటంపై బ్యాంకులు ఇతర అధికారులకు ఎలాంటి లేఖలు రాయకుండా వారిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేస్తూ అటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.