Virat Karrna: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వంలో యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా , నభా నటేష్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం నాగబంధం. జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్ర హీరో విరాట్ కర్ణ వరుసగా పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం గురించి, అలాగే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చి అంచనాలు పెంచేశారు.
కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప భారీ ప్రాజెక్టు లభించడం పై ,అలాగే ఈ ప్రాజెక్టు కోసం తాను పడ్డ కష్టం గురించి స్పందిస్తూ..” నాకు ఇంత పెద్ద ప్రాజెక్టు లభించడం కేవలం భగవంతుడి దయ. నా అదృష్టం. నా మొదటి సినిమా పెద్ద కాపు కూడా భారీ బడ్జెట్ తో కూడుకున్నదే. కానీ ఈ స్థాయిలో నాగబంధం లాంటి శతాధిక కోట్ల ప్రాజెక్ట్ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయితే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఒక నటుడిగా నా పాత్రకు 100% న్యాయం చేశాను. మొదటి సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లభించకపోవడంతో కొంతకాలం తీవ్ర నిరాశకు గురయ్యి .. డిప్రెషన్ కి లోనయ్యాను. కానీ ఫలితం మన చేతిలో ఉండదని, కష్టపడడమే మన వంతు అనే జీవిత సత్యాన్ని గ్రహించి మళ్లీ పట్టుదలగా అవకాశాలు వెతకడం మొదలు పెట్టాను. అలా కెరియర్ లో గ్యాప్స్ రాకుండా చూసుకుంటూ ప్రతి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను.
పెద్దకాపు సినిమాలో నన్ను చూసి డైరెక్టర్ అభిషేక్ ఈ సినిమాకు నన్ను ఎంపిక చేసినట్లు చెప్పడం.. నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక కథ విన్నప్పుడే నాకు అందులోనే రుద్ర, నాగసాధు అనే రెండు విభిన్న పాత్రల స్వభావం గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ కథ నా కోసమే పుట్టిందనే బలమైన భావన కలిగి , మరుసటి రోజు నుంచే జిమ్, హార్స్ రైడింగ్ , యాక్టింగ్ వర్క్ షాప్స్, డాన్స్ లో పాల్గొన్నాను. మరో 5 కిలోలు పెరిగి, మళ్ళీ బరువు తగ్గే సుదీర్ఘమైన శారీరక పరిణామాన్ని ఎదుర్కొన్నాను.
also read:విజువల్ వండర్ గా నాగబంధం.. తెరవెనుక రహస్యాలను బయటపెట్టిన ఆర్ట్ డైరెక్టర్!
ఇక సినిమా మొదలవ్వడానికి మూడు నెలల ముందే ఆధ్యాత్మికంగా కూడా నా శరీరాన్ని మనస్సును సిద్ధం చేసుకున్నాను. మూడు నెలల విరామంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకే లేచి శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయడం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా నాలో ఒక తెలియని సానుకూల ఎనర్జీ వచ్చింది. అది నాగ సాధు పాత్రను రక్తి కట్టించడానికి చాలా ఉపయోగపడింది. ఈ సినిమా క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కండరాలు విరిగిపోయి తీవ్రమైన నొప్పి ఎదురైనా భరించాను. వైద్యులు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నా.. నేను సినిమా కోసం కష్టపడ్డాను.
ముఖ్యంగా హైదరాబాద్ లో చలికాలంలో డిసెంబర్ రాత్రివేళల్లో షర్టు లేకుండా ఒంటికి రంగులు పూసుకొని 200 అడుగుల ఎత్తులో రోప్స్ సహాయంతో ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు.. జరిగిన ఒక భయంకరమైన సంఘటన నన్ను ఇబ్బంది పెట్టింది. కింద ఉన్న థాయిలాండ్ ఫైట్ మాస్టర్ కిచ్చాకి తెలుగు రాకపోవడం వల్ల కిందకు దించమంటే పైకి లేపాడు. దాంతో చలి తీవ్రతకు శరీరం గడ్డకట్టుకుపోయి మెదడు మొద్దు బారిపోయింది. వెంటనే దర్శకుడు అపోలో హాస్పిటల్ కి తరలిస్తే పరీక్షల్లో డెంగ్యూ ఉందని తేలింది. అయినప్పటికీ ఒకరోజు మాత్రమే విశ్రాంతి తీసుకొని , మళ్ళీ నేను షూటింగ్ సెట్ కి వెళ్ళాను అంటూ తన అంకిత భావాన్ని చాటుకున్నారు విరాట్ కర్ణ .
ఇక అలా ఎన్నో విషయాలను పంచుకున్న విరాట్ కర్ణ చివరిలో ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇక మొత్తానికైతే సినిమా అనుభవాలను పంచుకొని అంచనాలు పెంచిన విరాట్ కర్ణ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.