CEC Appointment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలపై గతంలో వెలువడిన భిన్న తీర్పులను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. సీఈసీ నియామకానికి సంబంధించి 2023లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. సీఈసీ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి (సీజేఐ) స్థానం లేకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ పలువురు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఇటీవల కోర్టులో సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీలో సీజేఐ తొలగింపును కేంద్రం సమర్థించుకుంది. సీఈసీ నియామకానికి సంబంధించి నూతన చట్టంతో ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి దెబ్బతినదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రధాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని ముందే భావించడం తప్పు అని పేర్కొంది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఆర్టికల్ 324(2) ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకాలపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని కేంద్రం తెలిపింది.
నియామక కమిటీలో సీజేఐ తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని కోర్టుకు తెలిపింది. కమిషనర్ల పదవీ భద్రతే ఈసీ స్వయంప్రతిపత్తికి మూలస్తంభం అని కేంద్రం అభిప్రాయపడింది. అయితే పిటిషనర్ల తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ నియామక కమిటీ నుంచి సీజేఐని తొలగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు.
కేంద్రం వాదనలు విన్న అనంతరం సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన 2023 నాటి చట్టంపై గత నెల 23న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాలని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడితే.. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరపాలని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు. భిన్న తీర్పుల నేపథ్యంలో తగిన ధర్మాసనం ఏర్పాటు కోసం పిటిషనర్లు సీజేఐ బెంచ్ ను ఆశ్రయించారు.
Also Read: పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!
బుధవారం విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ పిటిషన్ ను క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా గతంలో ఇచ్చిన భిన్న తీర్పును రీకాల్ చేయాలన్న పిటిషన్ ను సీజేఐ పరిశీలించనున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై న్యాయపరమైన నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.