ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం సాహస పరాక్రమాలు మనందరికీ తెలుసు. శత్రు దేశంలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ మిస్ కాకుండా నేలమట్టం చేశాయి మన సైనిక బలగాలు. అదే సమయంలో శత్రుదేశం ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను చాకచక్యంగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో భారత సైనికులను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రశంసించింది. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. స్వయంగా సైనిక శిబిరాలకు వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలసి అభినందించారు. అయితే ఈ ప్రశంసలకు అర్హుడైన ఓ పదేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. అదేంటి, పదేళ్ల కుర్రాడికి ఆపరేషన్ సిందూర్ కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.
పౌర యోధుడు..
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ గ్రామం భారత్-పాక్ సరిహద్దు ప్రాంతం. ఈ గ్రామానికి చెందిన పదేళ్ల శ్రావణ్ సింగ్ స్థానికంగా పాఠశాలకు వెళ్తున్నాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శ్రావణ్ సింగ్ ఇంటి వద్దే ఉన్నాడు. సైన్యం కూడా శ్రావణ్ సింగ్ ఇంటి వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే మిసైల్స్ ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వదులుతున్నారు. సహజంగా ఇలాంటి సమయాల్లో స్థానికులు భయపడి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఆయా ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడరు. కానీ సైనికులకు సాయంగా నిలబడ్డారు మామ్ డోట్ గ్రామ ప్రజలు. అందులోనూ శ్రావణ్ సింగ్ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికులకు తనకు తోచిన సాయం చేశాడు. అందుకే అతడిని భారత సైన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న అతి చిన్న వయసున్న పౌర యోధుడి(సివిల్ వారియర్)గా గుర్తింపు నిచ్చింది. 7వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్(GOC) అయిన మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రాల్.. శ్రావణ్ సింగ్ ని ప్రత్యేకంగా అభినందించారు.
అసలు శ్రావణ్ ఏం చేశాడు..
యుద్ధం సమయంలో సైనికుల సమీపంలోనే బాంబుల వర్షం కురుస్తుంది. వారి శిబిరాల వద్ద మిసైల్స్ పడుతుంటాయి. కానీ వారు అత్యంత ధైర్య సాహసాలతో యుద్ధంలో పాల్గొంటారు. పక్కనే బాంబులు పడే ప్రమాదం ఉందని తెలిసినా సరిహద్దులనుంచి వెళ్లిపోరు. ప్రాణ భయం ఉన్నా కూడా శ్రావణ్ సింగ్ సైనిక శిబిరం వద్దే ఉంటూ సైనికులకు అవసరమైన సామగ్రిని అందించాడు. నీరు, పాలు, టీ, లస్సీ, ఇతర ఆహార పదార్థాలను వారికి చేరవేశాడు. ఆపరేషన్ సిందూర్ లో సైనికులకు రిఫ్రెష్ మెంట్లు అందించినందుకు శ్రావణ్ సింగ్ ని భారత సైన్యం సత్కరించింది. యంగెస్ట్ సివిల్ వారియర్ అనే ఘనతనిచ్చింది.
సైనికులకు సహాయంగా ఉండటం, వారికి అవసరమైన పదార్థాలను అందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నాడు శ్రావణ్ సింగ్. యుద్ధం సమయంలో ప్రతి పౌరుడూ సైనికుడిగా మారాలంటున్నాడు. అంతే కాదు, పెద్దయ్యాక తాను కూడా సైనికుడిగా దేశ సేవ చేస్తానని చెబుతున్నాడు శ్రావణ్ సింగ్. పదేళ్ల వయసుకే నరనరాల్లో దేశభక్తి నింపుకున్న శ్రావణ్ సింగ్ కి భారత సైన్యమే కాదు, మనలాంటి పౌరులంతా సెల్యూట్ చేయాల్సిందే.