Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించదనే చెప్పాలి. తెల్లవారుజామును ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దెబ్బకు ప్రజలకు తిప్పలు తప్పలేదు. ద్వారకాలో భారీగా వీచిన ఈదురుగాలుల కారణంగా ఓ ఇంటిపై చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుల్లో తల్లి, ముగ్గురు చిన్నారులు ఉండగా.. భర్త గాయాలతో బయటపడ్డాడు.
ఇక మారిన వాతావరణం ఎఫెక్ట్ విమానాలపై పడింది. ఇప్పటికే 40 విమానాలను డైవర్ట్ చేయగా.. వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. NCR పరిధిలో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ అధికారులు.. ఆ తర్వాత దానిని ఆరెంజ్ అలర్ట్‌గా జారీ చేశారు. 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకస్మీక వర్షాల దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.
ఐఎండీ హెచ్చరిక
ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి నిలుపుదల కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఢిల్లీలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు వేగంతో భీకరమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు, ఉరుములు, గాలులు కొనసాగే అవకాశం ఉన్నందున, ఢిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. కాగా రోడ్, పీతంపుర వంటి ఇతర ప్రాంతాల్లోనూ గాలుల తీవ్రత అధికంగా ఉంది. పలు చోట్ల వడగండ్లు వాన కూడా కురిసింది. పరిస్థితులు కొంత మెరుగుపడిన తర్వాత ఐఎండీ రెడ్ అలర్ట్ ను ఆరెంజ్ అలెర్ట్‌గా మార్చనుంది.
ఏపీ, తెలంగాణకు వాతావరణ హెచ్చరిక
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలివానకు విద్యుత్ సేవల్లో అంతరాయం ఏర్పడగా.. విద్యుత్ నిలిపి వేశారు అధికారులు. అనంతపురం, చిత్తూరు,నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల నమోదవుతాయని తెలిపింది.
ప్రభుత్వ సూచనలు:
ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావద్దు
లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యుత్ సమస్యలపై స్తానిక అధికారులను సంప్రదించాలి.