Blast In Maharashtra : మహారాష్ట్రలోని ఆర్టినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నాగ్‌పూర్ సమీపంలోని భారత ప్రభుత్వ దళాలకు మందుగుండు సామగ్రితో పాటు ఆయుధాల్ని తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏకంగా 8 మంది కార్మికులు చనిపోగా, మరింత మంది గాయపడ్డారు. పేలుడు శబ్ధం ఏకంగా 5 కి.మీ దూరం వరకు వినిపించిందటం..పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాగా.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలో పేలుడు వార్త అందుకున్న భద్రతా, పోలీసు సిబ్బంది హుటాహుటిగా సంఘటనా స్థలాలకు చేరుకున్నారు.
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో భారత్ ఆర్మీ కోసం ఆయుధాలు తయూరు చేసే ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో ఎంతో పకడ్భందీగా సాగే కార్యక్రమాలు.. రోజులాగే ప్రారంభమైయ్యాయి. అంతా సజావుగా సాగుతున్న క్రమంలోనే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు దాడికి ఫ్యాక్టరీలోని పెద్ద నిర్మాణాలు కూలిపోగా, పేలుడు శబ్దం చుట్టుపక్కల దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటనను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగ్ పూర్ కి వచ్చిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పెద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని, మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు తనకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి.. సభలోని వారు ఓ నిముషం మౌనం పాటించాలని కోరారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. ఫ్యాక్టరీలోని ఎల్‌టీపీ విభాగంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్థరించిన జిల్లా కలెక్టర్.. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది చేరుకున్నారని తెలిపారు. ఫ్యాక్టరీలోని మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
ఆర్టినెన్స్ ఫ్యాక్టరీలో ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. మండే, పేలే స్వభావమున్న పదార్థాలు, కెమికల్స్ ఉంటుంటాయి. అలాంటి చోట్ల సాధారణంగా ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అలాంటిది.. భారీ పేలుడు జరగడంతో ఫ్యాక్టరీ పైకప్పు పూర్తిగా కూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ విభాగంలో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. అత్యంత కష్టంగా ముగ్గురి ప్రాణాలు రక్షించారు. మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు పెద్ద ఎక్సావేటర్‌ను ఉపయోగించారు.
Also Read :
పేలుడు జరిగిన వెంటనే అక్కడ భారీ ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా భయపడిపోయారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పేలుడు జరిగిన ప్రదేశానికి ఉన్నతాధికారులు చేరుకున్నట్లు వెల్లడించారు. నాగ్‌పూర్ నుంచి రెస్క్యూ బృందాలు సైతం బయలుదేరాయని తెలిపిన ఆయన.. త్వరలోనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయని అన్నారు. కాగా.. ఈ ప్రమాదంపై ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అత్యంత పకడ్భందీగా నిర్వహించే కార్యకలాపాల మధ్య పేలుడుకు దారి తీసిన పరిణామాలేంటని విచారిస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఎలాంటి తప్పిదాలు, భద్రతకు ముప్పుగా ఉన్న అంశాలను పరిశీలిస్తున్నారు.