పహల్గాం మారణకాండ జరిగిన తర్వాత వెంటనే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది, పాకిస్తాన్ లోని తీవ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత భారత్ లో గూఢచర్యానికి పాల్పడుతున్న ద్రోహులకు చెక్ పెట్టింది. పాకిస్తాన్ తో చేతులు కలిపి, భారత రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఆరుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో జ్యోతి మల్హోత్రా అనే ట్రావెల్ వ్లాగర్ ఒకరు. యూట్యూబర్ గా, ఇన్ ఫ్లూయెన్సర్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న జ్యోతి మల్హోత్రా.. మన రహస్యాలను పాక్ కి చేరవేశారనే ఆధారాలను అధికారులు సేకరించారు. ఆమెతో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే జ్యోతి మల్హోత్రా వ్యవహారాన్ని ఏడాది క్రితమే ఓ వ్యక్తి అనుమానించడం విశేషం. ట్రావెల్ విత్ జో అనే పేరుతో సోషల్ మీడియా అకౌంట్లు రన్ చేస్తున్న జ్యోతి.. అనుమానాస్పద అంతర్జాతీయ ప్రయాణాలను ఓ వ్యక్తి ఏడాది క్రితమే సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. అంతే కాదు. ఆమెపై NIA నిఘా ఉంచాలని కూడా కోరాడు. అప్పుడే పోలీసులు, సైన్యం అలర్ట్ అయి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ జ్యోతి మల్హోత్రా..?
హర్యానా లోని హిసార్ కి చెందిన జ్యోతి మల్హోత్రా.. ట్రావెల్ వ్లాగ్ ని రన్ చేస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షలమంది సబ్ స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి 1.33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆమె పలు కంపెనీలకు ప్రచారం కూడా చేస్తుంటారు. ఇది ఆమె వృత్తి అయితే.. పాకిస్తాన్ కి గూఢచర్యం చేయడం ఆమె ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ఆమె సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెతో సంప్రదింపులు జరిపిన ఓ అధికారిని మే 13న భారత్ బహిష్కరించడం విశేషం. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా కూడా అరెస్ట్ అయ్యారు.
ఏడాది కిందటే..?
జ్యోతి మల్హోత్రా కదలికలపై ఇప్పుడు అనుమానం వచ్చి సైన్యం, పోలీసులు ఆమెకి చెక్ పెట్టారు. అయితే ఏడాది క్రితమే ఆమె కదలికల్ని అనుమానించాడు కపిల్ జైన్ అనే వ్యక్తి. 2023లో ఆమె రెండుసార్లు పాకిస్తాన్ ని సందర్శించారు. ఆ తర్వాత ఆమె కాశ్మీర్ లో కూడా పర్యటించారు. ఈ వరుస పర్యటనల వెనక ఏదో రహస్యం ఉండే ఉంటుందని అనుమానించాడు కపిల్ జైన్. పాకిస్తాన్, ఆ తర్వాత వెంటనే కాశ్మీర్.. ఇలా రెండుసార్లు ఆమె పర్యటనల షెడ్యూళ్లు ఉండటం ఆయన అనుమానానికి ప్రధాన కారణం. అయితే కపిల్ జైన్ ఈ విషయాన్ని ఏడాది క్రితమే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల్ని అలర్ట్ చేశారు. ఆమెపై నిఘా పెట్టాలన్నారు. ఆమె కదలికలు అనుమానంగా ఉన్నాయని చెప్పారు. కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె అరెస్ట్ అనంతరం అందరూ కపిల్ జైన్ ని ప్రశంసిస్తున్నారు.
@NIA_India please keep close watch on this lady..she first visited and attained pakistani embassy function then visited pakistan for 10 days now she is heading for kashmir… may be some link behind all these pic.twitter.com/kfrXZNhMuE
— kapil Jain (@chupchaplo) May 10, 2024
దర్యాప్తు సంస్థ అధికారులు చేయాల్సిన పనిని ఏడాది క్రితమే కపిల్ జైన్ చేశారని ఆయన్ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆయన సూచనల్ని అప్పట్లో అధికారులు ఎందుకు పట్టించుకోలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. కపిల్ జైన్ గతేడాది మే లో పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడం విశేషం. 2023లో పాకిస్తాన్ వీసా కోసం భారత్ లో ఉన్న ఆ దేశ హైకమిషన్ ఆఫీస్ కి వెళ్లిన సందర్భంలో ఆమెకు అక్కడ పరిచయాలేర్పడ్డాయి. ఆ పరిచయాలతో ఆమె పాకిస్తాన్ కి వెళ్లి, అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. అప్పుడే ఆమె భారత్ కి చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీనికోసమే ఆమె ట్రావెల్ వ్లాగ్ పేరుతో భారత రహస్యాలన్నీ సేకరిస్తున్నట్టు కూడా అనుమానాలున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఆమె విషయంలో పోలీసులు, సైన్యం అలర్ట్ అయ్యాయి. గతేడాది కపిల్ జైన్ పోస్ట్ ని గనక అధికారులు చూసి అప్రమత్తం అయిఉంటే పహల్గాం జరిగేది కాదేమోనని నెటిజన్లు అంటున్నారు.