Actress Kasthuri : నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఎప్పటి నుంచో సామెత ఉండనే ఉంది. కాదని.. నోటికి పని చెబితే, ఊరు విడిచి వెళ్లాల్సి వస్తుంది. సరిగా.. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.. నటి కస్తూరి. తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలపాలైన నటి కస్తూరికి ఇబ్బందులు ఎదురైనట్లే కనిపిస్తోంది. తన వ్యాఖ్యలతో తెలుగు ప్రజలు తీవ్రంగా కలత చెందగా.. వాటి తాలుకు పర్యావసనాలు ఆమెకు ఎదురవుతున్నాయి.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒకప్పటి సినీ హీరోయిన్ కస్తూరీపై తమిళనాడులోకి తెలుగు వాళ్లు ఎలా వచ్చారు అనే విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలిసీతెలియని మాటలతో.. అక్కడి వారి ఆగ్రహానికి గురైంది. ఇవేం మాటలు అంటూ.. అందరూ విమర్శలకు దిగారు. దాంతో.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. అదే సందర్భంలో తన వ్యాఖ్యలను.. డీఎంకే పార్టీ వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. దాంతో వివాదం కాస్తా.. తెలుగు వారి నుంచి అక్కడి రాజకీయాలకు చుట్టుకుంది. జరిగిన విషయానికి తెలుగు వారికి బుద్ధిగా క్షమాపణలు చెప్పి తప్పించుకోవాల్సింది పోయి.. ఏకంగా అధికార పార్టీ పై విమర్శలకు దిగింది. దాంతో.. ఆమె మరింత చిక్కుల్లో పడింది.
క్రమంగా కస్తూరి మాటలు తెలుగు వారిని బాధ పెట్టడంతో తమిళనాడు వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లల్లో కేసులు పెట్టారు. వారికి అధికార పార్టీ పోత్సాహం కూడా తోడవడంతో.. నటి కస్తూరికి తిప్పలు తప్పవని అర్థం అయ్యింది. అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే భయం పట్టుకుంది. దాంతో.. ఇంటి నుంచి పరారీ అయ్యింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ.. మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై నమోదైన కేసుల గురించి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులకు.. కస్తూరి ఇంటికి తాళం వేసి కనిపించింది. ఆమె ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ వస్తుండడంతో.. పోలీసు నోటీసులను ఇంటికి అంటించారు. తన మాటలను వెనక్కి తీసుకున్నానని, ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినని వెల్లడించిన నటి కస్తూరి.. తనపై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారంటూ పిటిషన్ లో వెల్లడించింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.
వివాదం ఎక్కడ మొదలైంది..
ఇటీవల ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొంది. అక్కడ నాలుగు మాటలు మాట్లాడి వెళ్లాల్సిన ఆమె.. ఏకంగా తమిళ చరిత్రలోకి వెళ్లింది. తమిళనాడులోకి తెలుగు వాళ్లు ఎలా వచ్చారో.. చెప్పుకొచ్చింది. అందులో.. తమిళనాడులో సుమారు మూడు వందల ఏళ్ల నాడు, అక్కడి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు వచ్చారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాళ్లు.. ఇక్కడ ఉంటున్న బ్రహ్మణులను తమిళులు కాదంటున్నారని వెటకారంగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నటి కస్తూరి వివాదంలో చిక్కుకుంది.