Delhi Secretariat Seal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయం కావడంతో ఢిల్లీ సెక్రటేరియట్ ను సీల్ చేశారు. ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంలోని జెనెరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల ప్రకారం.. ప్రభుత్వం ఉద్యోగులు ఎటువంటి ఫైల్స్, కీలక డాకుమెంట్స్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి బయటికి తీసుకు వెళ్లడానికి అనుమతి లేదు. ప్రభుత్వ కీలక దస్తావేజులు, రికార్డుల భద్రతా కారణాల రీత్యా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
“ప్రభుత్వ దస్తావేజులు, రికార్డుల భద్రతా కారణాల రీత్యా.. సెక్రటేరియట్ ఆఫీసుల్లోని ఎటువంటి ఫైల్స్, డాకుమెంట్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ లాంటి ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి బయటికి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఒకవేళ అత్యవసరమైతే జెనెరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అనుమతి తప్పనిసరి. ఈ మేరకు సెక్రటేరియట్ కు చెందిన అన్ని విభాగాల ఇన్ చార్జిలు, డిపార్ట్‌మెంట్ హెడ్లు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ” ఢిల్లీ గవర్నర్ కార్యాలయం నుంచి జారీ అయిన నోటీసులో ఉంది.
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత సెక్రటేరియట్ నుంచి కీలక ఫైల్స్ చోరి అయ్యాయి. ఈ కీలక ఫైల్స్ పరిశీలిస్తే అధికారంలో ఉన్నప్పుడు పలువురు మంత్రుల చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఫైల్స్‌ను సెక్రటేరియట్ నుంచి ఉద్దేశపూర్వకంగా మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న తరువాత ఆ సమయంలో సెక్రటేరియట్ నుంచి ఎటువంటి ఫైల్స్ బయటికి తీసుకెళ్లకూడదని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విద్యుత్, నీటి పారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. చాలా రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓటమి తరువాత సెక్రటేరియట్ లో షార్ట్ సర్క్యూట్ నెపంతో పాత ఫైళ్ళు తగలబెట్టారన్న అపవాదులు ఉన్నాయి.
సాధారణంగా సెక్రటేరియట్ నుంచి మంత్రి పేషీలకు అధికారులు ఫైల్ తీసుకెళుతూ ఉంటారు. కానీ అవి తిరిగి వచ్చాయా? లేదా? అనేది ఎన్నికల తరువాత సరిచూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అధికార పార్టీ ఓడిపోవడంతో విజయం సాధించిన బిజేపీ అభ్యర్థన మేరకు ఢిల్లీ గవర్నర్ అప్రమత్తంగా నోటీసులు జారీ చేశారు.