Ahmedabad Plane Crash : ఎండాకాలం మధ్యాహ్నం బయటకు వస్తే మంట మండిపోతుంది. చర్రం సుర్రుమంటుంది. బాబోయ్ అని నీడకు పరిగెడతాం. ఆ టైమ్‌లో మాగ్జిమమ్ 48 డిగ్రీల టెంపరేచర్ ఉండొచ్చు. 48 డిగ్రీలకే మనం అంతలా అల్లాడిపోతామే.. అలాంటిది వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి దారుణమే జరిగింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం దుర్ఘటనలో. విమానం నేల కూలగానే.. అందులోని ఇంధన ట్యాంక్ పేలిపోయింది. కొన్ని వందల బాంబులు ఒకేసారి కలిసి పేలితే ఎలా ఉంటుందో అలా.
ఆ పేలుడు తీవ్రతకు ఏకంగా 1000 డిగ్రీల వరకు టెంపరేచర్ క్రియేట్ అయిందని అంటున్నారు. ఆ వేడికి ప్రయాణికులు.. మాంసం ముద్దలుగా మాడిపోయారు. సమీపంలోని కుక్కలు, పక్షులు సైతం వెంటనే అక్కడి నుంచి పారిపోలేకపోయాయి. అంత స్పీడ్‌గా మంటలు చెలరేగడం, భరించలేనంత ఉష్ణోగ్రతతో మసికావడం జరిగిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా కష్టం అయిందని చెబుతున్నారు.
విమానంలో బోలెడంత ఇంధనం
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు 8,148 కిలోమీటర్ల దూరం ఉంది. సుదీర్ఘ ప్రయాణం కావడంతో ఎయిర్ ఇండియా AI 171 ఫ్లైట్‌లో లక్షా 25 వేల లీటర్ల ఇంధనం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యలో ఎక్కడా ఆపాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా లండన్ వరకు వెళ్లగలదు ఆ విమానం. ప్రమాద సమయంలో ఆ ఫ్యుయల్ అంతా ఒక్కసారిగా పేలిపోయి మంటలు ఎగిసిపడ్డాయి. వీడియోల్లో ఆ దృశ్యాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆ వేడి వందలాది బాంబులు ఒకేసారి పేలినంత తీవ్రతతో సమానం అంటున్నారు. అందులోనూ జనావాసాలు ఉండే చోట.. మెడికల్ కాలేజ్ భవనంపై విమానం కూలడంతో మరింత హాని జరిగింది.
సేఫ్ విమానాలే.. కానీ…
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలు 2011 నుంచి ఎగరడం ప్రారంభించాయి. ఇప్పటి వరకైతే ఎటువంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగలేదు. అయితే, గతంలో బ్యాటరీ మంటలు, హైడ్రాలిక్ లీకేజీలు వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ ఎంత సేఫ్ అనే భద్రతాపరమైన భయాందోళనలు తలెత్తాయి. ఇటీవల ఇదే విమానం రెండుసార్లు టెన్షన్ పెట్టిందని తెలుస్తోంది. ఓసారి పొగలు వచ్చాయని.. మరోసారి దుబాయ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేసిందని అంటున్నారు. అయితే, అహ్మదాబాద్ ప్రమాదమే బోయింగ్ 787-8 కేటగిరిలో మొదటి అతిపెద్ద విధ్వంసకర ప్రమాదం.
అణుబాంబు అంత తీవ్రత ఉందా?
చాలా మంది ఈ ప్రమాదాన్ని అణుబాంబు పేలుడుతో కంపేర్ చేస్తున్నారు కానీ.. అది వేరు ఇది వేరు. అణుబాంబు పేలితే మామూలుగా ఉండదు. అహ్మదాబాద్ సగం సిటీ స్మాష్ అవుతుంది. విమాన ప్రమాదం ఓ చిన్న ప్రాంతానికే పరిమితం అయింది. కాకపోతే ఈ దుర్ఘటనలో 269 మంది చనిపోవడమే తీవ్ర విషాదకరం.