Marshal AP Singh : భారత వాయుసేనాను ఆధునీకరించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ల మేరకు యుద్ధ విమానాల్ని సరఫరా చేయలేకపోవడంపై దేశీయ తయారీ సంస్థలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతికతను ఆలస్యం చేయడం అంటే.. దాన్ని తిరస్కరించడంతో సమానమని వ్యాఖ్యానించారు. సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ నిర్వహించిన 21వ సుబ్రొతో ముఖర్జీ సెమినార్‌లో పాల్గొన్న ఏసీఎమ్ సింగ్.. రంగ రంగ ఉత్పత్తుల సంస్థల విధానాలపై ఆగ్రహించారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానాల కోసం దేశీయ రక్షణ పరిశోధన సంస్థలు.. 1984లో తొలి ప్రయత్నం ప్రారంభించాయని గుర్తు చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్.. ప్రస్తుతం 2025 వచ్చిందని.. అయినా ఇంకా 40 యుద్ధ విమానాల్ని కూడా తయారు చేయలేదని అన్నారు. ఏళ్ల తరబడి తమ దగ్గరున్న సాంకేతికతో కూాడా విమానాల్ని తయారు చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ తేజస్ యుద్ధ విమానాల్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఉత్పత్తి చేస్తుండగా.. డెలివరీలను 2016లో ప్రారంభించింది. కాగా.. వీటి కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గతంలోనే ఆర్డర్లు పెట్టగా.. ఇప్పటి వరకు ఆయా విమానాల్ని డెలివరీ చేయలేదు.
దేశీయ అవసరాలకు అనుగుణంగా.. భారీ స్థాయిలో యుద్ధ విమానాల్ని, ఇతర అవసరాలను తీర్చుకునేందుకు అత్యాధునిక వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. అలా జరగాలంటే.. ఫైటర్ జెట్ల సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తి రంగాల్లో ప్రైవేట్ రంగాలకు అవకాశం కల్పించాలన్నారు. అప్పుడే.. ఆర్డర్లు కోల్పోతామనే భయాన్ని కలిగించగలమని వ్యాఖ్యానించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశం.. ప్రపంచంలో గుర్తింపు పొందాలంటే ఎయిర్ ట్రాన్స్ పోర్టు రంగంలో ఆశించిన మేర అభివృద్ధి జరగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం.. ఈ ఫైటర్ జెట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ రంగంలోని అత్యాధునిక వ్యవస్థలను సమకూర్చుకునేందుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆధునిక సాంకేతికత అభివృద్ధి, నూతన ఆవిష్కరణల కోసం మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం.. అంతర్జాతీయంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. భారత్ సరిహద్దుల్లో పెరిగిపోతున్న సైనికీకరణపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. చైనా భారీ స్థాయిలో తన సైన్యంపై ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా.. ఎయిర్ ఫోర్స రంగాన్ని భారీగా సంస్కరిస్తుండగా, నూతన ఆవిష్కరణలను ఆవిష్కరిస్తోంది. ఇటీవల కాలంలో.. పాశ్చాత్య దేశాల తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దిన రెండు స్టెల్త్ ఫైటర్ జెట్ల అంశాన్ని గుర్తు చేశారు. అవి ఆరో తరానికి చెందిన యుద్ధ విమానలని, వాటి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
Also Read : జపాన్ ‘పని’ మరణాల హిస్టరీ మీకు తెలుసా? ‘కరోషి’ కల్చర్‌కు నేటితరం గుడ్‌బై!
పాక్ సైతం అత్యాధునిక విమానాలు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుందని, చైనా నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తులతో దూసుకుపోతుందన్న ఏసీఎమ్ ఏపీ సింగ్.. భారత్ మాత్రం ఇంకా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ప్రోగ్రామ్, అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ డిజైన్ దశలోనే ఉందని అన్నారు. ఇలా.. సాంకేతిక ఆవిష్కరణలో వెనుకబడితే.. అంతిమంగా దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు.