Delhi to Vienna flight: ఒక్కసారిగా గాలిలోకి లేచి 900 అడుగుల క్రింద పడిపోయిన ఓ విమానం.. వెంటనే అలారంలు, హెచ్చరికలు.. కానీ.. పైలట్ చాకచక్యంగా స్పందించి ప్రమాదాన్ని తప్పించారు. ఢిల్లీ నుంచి వియన్నాకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-187 లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మళ్లీ విమాన ప్రయాణ భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది.
ఒక్కసారిగా కిందపడిపోయిన విమానం
జూన్ 14 వేకువజామున 2:56కు ఢిల్లీ IGI ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 777 (AI-187) విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా 900 అడుగుల గగనతలాన్ని కోల్పోయింది. పైలట్‌కు గాల్లోంచే Don’t sink! Don’t sink అంటూ గ్రౌండ్ ప్రాక్సిమిటీ అలర్ట్లు వస్తుండగా, రికార్డర్‌లలో స్టాల్ వార్నింగ్స్ కూడా వినిపించాయి. ఇది సాధారణ ఘటన కాదు.. ఏదైనా దుర్మరణకర ప్రమాదానికి నాంది అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.
హీరోలా నిలిచిన పైలట్
అలాంటి ఘటన సమయంలో పైలట్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా, బహుశా అపార అనుభవంతో స్పందించారు. వెంటనే ఫ్లైట్‌ను నియంత్రించి తిరిగి రూట్‌పైకి తీసుకెళ్లారు. తుది గమ్యమైన వియన్నాలో విమానం 9 గంటల 8 నిమిషాల ప్రయాణం తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన వల్ల ఎవరికీ గాయాలు కాలేదన్నది ఒక గొప్ప విషయం. పైలట్ చాకచక్యానికి ఇప్పుడు విమాన ప్రయాణికులే కాదు, విమానయాన రంగం మొత్తం సెల్యూట్ చేస్తోంది.
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత మరో షాక్
ఈ ఘటన జరగడమే కాకుండా, ఇది జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన భయానక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత కేవలం 38 గంటల వ్యవధిలోనే జరగడం గమనార్హం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI-171 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో 270 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించినట్లు అధికారికంగా వెల్లడించబడింది. ఆ ఘటన మరువక మునుపే, పైలట్ సమయస్పూర్తితో ఈ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో.. AI-187 ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, వాస్తవానికి ఏం జరిగింది అన్నదాని మీద ప్రజల్లో మరింత అనుమానాలను పెంచుతోంది.
విమాన భద్రతపై DGCA దృష్టి
ఈ ఘటనపై వెంటనే పైలట్లను డ్యూటీ నుంచి తాత్కాలికంగా తప్పించినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. పైలట్ నివేదిక అందిన వెంటనే DGCAకి వివరాలు పంపినట్లు సంస్థ తెలిపింది. అనంతరం విమానం నుంచి పొందిన డేటాను పరిశీలించాకే పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభమైంది. DGCA ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు చెందిన గురుగ్రామ్ ప్రధాన కార్యాలయంలో ఓ విస్తృత ఆడిట్ నిర్వహిస్తోంది. ఇందులో ఫ్లైట్ ఆపరేషన్స్, షెడ్యూలింగ్, రోస్టింగ్, IOCC వ్యవస్థ వంటి అంశాలపై నిఘా వేస్తోంది.
Also Read: AP Telangana rain alert: మరో వారం రోజులు దంచుడే.. ఈ నగరాల్లో ఉంటే జాగ్రత్త: IMD
గత కొద్ది రోజులుగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు, శ్రద్ధలేని మెయింటెనెన్స్ వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జరిగిన DGCA భద్రతా ఆడిట్‌లోనూ కొన్ని తీవ్ర లోపాలు బయటపడ్డాయట. దీంతో ప్రయాణికులలో సంస్థపై నమ్మకం తారాస్థాయికి తగ్గిపోతోంది.
ఇలాంటి ఘటనలు తరచుగా జరిగితే, ప్రయాణికులు భద్రత విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఒకసారి విమానంలో ఎగిరిపోయాక నమ్మకం ఒక్కటే మనకు తోడుగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి అప్రమత్తత తప్పక అవసరం. ఈ దర్యాప్తుతో పాటు, ఎయిర్ ఇండియా తన ఆపరేషన్లలో పారదర్శకత, నాణ్యత పెంచకపోతే.. భవిష్యత్‌లో నష్టం తప్పదు.
గాల్లో 900 అడుగులు కింద పడిన విమానం.. కానీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్‌ను ప్రశంసించక తప్పదు. కానీ ఇటువంటి ఘర్షణలు పూర్తిగా నివారించాల్సింది ఎయిర్‌లైన్ సంస్థల బాధ్యత. ప్రయాణికుల ప్రాణాలకు ముందు భద్రతే మొదటి ప్రమాణంగా ఉండాలి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. అందులో ఉన్న హెచ్చరికలు మాత్రం సమయానికి అర్థం చేసుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.