Nara Lokesh: కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతూ.. అవసరమైన సాయం అందిస్తుంది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన జగదీష్ దంపతుల ఆరు నెలల చిన్నారి దీపు, పుట్టకతోనే లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు అత్యవసర వైద్య సేవల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేష్.
ఆరోగ్య సమస్యతో అలమటిస్తున్న దీపు:
దీపు పుట్టిన కొద్ది రోజుల్లోనే అతని ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి. ప్రాథమికంగా గుండెకు సంబంధించిన సమస్య అనుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల్లో లివర్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. దీని చికిత్స ఖరీదైనదే కాక, ప్రాణాంతకమైనది కూడా కావడంతో, తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు.. దీపు చికిత్సకు రూ. 20 లక్షల ఖర్చు అవుతుందని వెల్లడించారు. పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో.. ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిశాడు.
అండగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా:
దీపు పరిస్థితిని తెలుసుకున్న షాజహాన్ బాషా వెంటనే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో 10 లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు అయ్యేలా చొరవ చూపారు. ఇది తమకు కొంత ఊరటనిచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. అయినా మిగిలిన డబ్బులు కోసం తాము ఏంచేయాలో తెలియక దిగులుగా ఉన్న సమయంలో.. వారు మంత్రి నారా లోకేష్‌ను కలిసి సహాయం కోరారు.
మంత్రి లోకేష్ స్పందన:
లోకేష్‌ను కలిసిన తర్వాత, చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న వెంటనే ఆయన మానవత్వంతో స్పందించారు. ప్రభుత్వం తరఫున మిగిలిన అవసరమైన మొత్తాన్ని అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచి ఎల్‌వోసీ మంజూరు చేయడం జరిగింది.
కుటుంబంలో ఆనందం:
దీపుకు అత్యవసర చికిత్స అందేలా మార్గం సుగమం కావడంతో.. జగదీష్ దంపతుల కుటుంబంలో ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారి ప్రాణం కాపాడడంలో భాగమైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మంత్రి లోకేష్‌కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటన, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. అధిక ఖర్చుతో కూడిన వైద్య సేవల అవసరమున్న.. పేద కుటుంబాలకు ప్రభుత్వ మద్దతు ఎంత ముఖ్యమో చాటిచెప్పింది. కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగానికి, ముఖ్యంగా పిల్లల వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల్లో విశ్వాసం పెరిగింది.
Also Read: మంత్రి అనిత అన్నంలో బొద్దింక.. అధికారులపై ఆగ్రహం
మానవత్వం, ప్రభుత్వ సహకారం, సమయోచిత స్పందన.. ఈ మూడు కలిసి ఒక చిన్నారి ప్రాణాన్ని రక్షించగలిగాయి. దీపు వంటి మరెంతో మంది పేద పిల్లలు కూడా ఇటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా జీవన ఆశ కలిగి ఉండగలుగుతున్నారు. ఇది కేవలం ఒక కుటుంబానికే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు ఆశ జ్యోతిగా నిలిచే ఉదాహరణ.