Air India Flight : భారత రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని చికాగో పయనిస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. ఫలితంగా విమానాన్ని కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు.
దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటన సైతం జారీ చేసింది. మంగళవారం దిల్లీలోని ఇందిర గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చికాగో వెళ్తున్న ఆల్ 127 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా, సదరు విమానాన్ని కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయంలో ఆకస్మికంగా ల్యాండింగ్ చేశారు.
అనంతరం భద్రతా ప్రోటోకాల్ ప్రకారం విమానంతో పాటు ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేశామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. విమానాశ్రయంలో ఏజెన్సీలను సైతం ఏర్పాటు చేశామని, తద్వారా ప్రయాణికులకు సహాయం చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. గత కొద్దిరోజులుగా ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థలకు అనేక బాంబ్ బెదిరింపు హెచ్చరికలు రాగా వాటిపై విచారణ చేపట్టిన అధికారులు ఇవన్నీ ఫేక్ గా తెల్చారు.
ఎయిర్‌లైన్ ఆపరేటర్‌గా తమకు బాధ్యతలున్నాయమన్న ఏయిర్ ఇండియా, ఆయా బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి క్షమాపణలు కోరింది.
ఇక బెదిరింపులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించేందుకు ఎయిర్ ఇండియా సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ఫలితంగా ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులను, అసౌకర్యానికి నిందితులే బాధ్యత వహించేలా చూస్తామని చెప్పింది. ఇదే సమయంలో విమానయాన సంస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చట్టపరమైన చర్యలు సైతం తీసుకుంటామని హెచ్చరించింది.
మరో ఘటనలో మంగళవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. బోయింగ్ 737-మాక్స్ 8 విమానంలో దాదాపుగా 132 మంది ప్రయాణికులు ఉన్నారు. జైపూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం అత్యవసరంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అనంతరం అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం సేఫ్ అనుకున్న అధికారులు, విమానం వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
also read : పోలింగ్‌కు 5 రోజుల ముందే అలా చేస్తాం, ఆ ఛాన్సే లేదు.. ఎగ్జిట్‌పోల్స్‌తో గందరగోళం: చీఫ్ ఎలక్షన్ కమిషనర్