
Amrit paul singh: వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ భారత్-నేపాల్ సరిహద్దుల్లోనే ఉన్నాడా? లేక ఇప్పటికే నేపాల్ చేరుకున్నాడా? అనే డైలమాలో ఉన్నారు పోలీసులు. మరోవైపు అమృత్ పాల్ వేటలోకి ఇండియన్ ఆర్మీ కూడా ఎంటరైంది. సరిహద్దుల్లో ఉండే అవకాశం ఉండటంతో.. అతను బార్డర్ దాటకముందే పట్టుకునేందుకు సశస్త్ర సీమా బల్ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికే అమృత్ పాల్ పోస్టర్లను అంటించారు. ఆ పోలికలతో ఎవరైనా కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే అమృత్ పాల్ ఇప్పటికే నేపాల్ చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు ఉత్తరాఖండ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా డెహ్రడూన్, హరిద్వార్, ఉదమ్ సింగ్ నగర్ లో అమృత్ పాల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అనుమానాలు ఉండటంతో.. ఆ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అక్కడి గురుద్వారాలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ పై పోలీసులకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. విదేశీ సంస్థలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఖలిస్థాన్ ఉద్యమానికి సపోర్ట్ గా విదేశీ నిధులను చేరవేయడంలో భాగంగానే అమృత్ పాల్ ను ఆమె పెళ్లి చేసుకుందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ కోణంలో ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఇక పోలీసుల కళ్లు గప్పి తిరుగున్న అమృత్ పాల్ వెంటనే లొంగిపోవాలని అతని తండ్రి కోరారు. లుక్ అవుట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో వెంటనే లొంగిపోవాలని కొడుకుకు విజ్ఞప్తి చేశాడు.