ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ద్వారకకు కాలి నడకన వెళ్తున్న సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ తిరుమల యాత్రలో ఉన్నారు. తండ్రి ముకేష్ అంబానీకి దైవ భక్తి ఉన్నా కూడా ఈ స్థాయిలో ఆధ్యాత్మిక యాత్రలు చేయలేదు. కానీ అనంత్, ఆకాష్ బ్రదర్స్ కి మాత్రం దేవుడంటే మరింత భక్తి ప్రపత్తులు ఉన్నాయని అర్థమవుతోంది.
తిరుమలలో ఆకాష్..
ముకేష్ అంబానీ పెద్ద కొడుకు, జియో సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ కాస్త లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు. పెద్దగా మీడియా ముందుకు రారు, తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో కూడ ఆయన ఎక్కువ విషయాలు పంచుకోరు. అయితే ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఉంది. తరచూ వివిధ ఆలయాలను ఆయన సందర్శిస్తుంటారు. తిరుమలకు కూడా ఆయన రెగ్యులర్ గా వస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి తిరుమలకు వచ్చారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చిన ఆకాష్ అంబానీ, రోడ్డు మార్గం ద్వారా కొండపైకి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆకాష్ తిరుమల యాత్ర పెద్ద విశేషమేమీ కాదు కానీ, సరిగ్గా ఇదే సమయంలో ఆయన తమ్ముడు అనంత్ అంబానీ ద్వారకాధీశుడి సేవలో ఉండటం విశేషం. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడిని దర్శించుకోడానికి అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్నారు. తమ్ముడు శ్రీకృష్ణుడి దర్శనం కోసం వెళ్లిన సమయంలోనే అన్న వెంకటేశ్వరుడి సేవలో పాల్గొనడం విశేషం.
అనంత్ పాదయాత్ర
లక్షల కోట్లకు వారసుడు. కావాలంటే అన్నీ తన ముందు సమకూరతాయి. అలాంటి అనంత్ అంబానీ, దేవుడి దర్శనం కోసం పాదయాత్ర చేస్తున్నారంటే ఆశ్చర్యమే. అది కూడా ఒకటీ, రెండు కిలోమీటర్లు కాదు, ఏకంగా 140 కిలోమీటర్లు. జామ్ నగర్ నుంచి ద్వారకకు ఆయన కాలి నడకన బయలుదేరారు. రోజుకి 15 నుంచి 20 కిలోమీటర్లు, అది కూడా కేవలం రాత్రి వేళల్లో మాత్రమే రోడ్డుపై నడుస్తూ, పగటి పూట హోటల్స్ లో విశ్రాంతి తీసుకుంటూ తన ఆధ్యాత్మిక యాత్ర కంటిన్యూ చేస్తున్నారు అనంత్ అంబానీ
అనంత్ యాత్రలో అన్నీ విశేషాలే. దారిన పోయే కోళ్ల ఫామ్ వ్యాన్ ని ఆపి, వాటన్నిటికీ ఖరీదు కట్టి.. అవి చికెన్ ముక్కలు కాకుండా కాపాడారు అనంత్ అంబానీ. అంతే కాదు, వాటిని తన వంతారా జూకి తరలించారు. ఇలాంటి సైడ్ లైట్స్ ఎన్నో ఈ యాత్రలో ఉన్నాయి. మార్చి 27న అనంత్ ఈ యాత్ర మొదలు పెట్టారు. ఈనెల 10న తన 30వ పుట్టినరోజు సందర్భంగా ద్వారకకు చేరుకోబోతున్నానరు అనంత్ అంబానీ. అనంత్ ద్వారకకు చేరుకునే సమయానికి ఆయన భార్య రాధికా మర్చంట్ కూడా ఆలయానికి వస్తారు. కొత్త దంపతులిద్దరూ ద్వారకలో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆకాష్ అంబానీ జియో చైర్మ్ గా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనంత్ అంబానీ బిజినెస్ వ్యవహారాలు చూస్తూనే తనకెంతో ఇష్టమైన వంతారా జూకి టైమ్ కేటాయిస్తుంటారు. అక్కడ జంతువులు, పక్షులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అనంత్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల జంతువులను సేకరించేందుకు, వాటి మెయింటెనెన్స్ కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. తమ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండి కూడా.. వీరు దైవభక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. తాజాగా అన్నదమ్ములిద్దరూ ఆధ్యాత్మిక యాత్రలు ఒకేసారి చేపట్టడం ఇక్కడ విశేషం.