Maoists Letter : మావోయిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. కనిపిస్తే కాల్చేసుడే. 2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శపథం చేశారు. అన్నట్టుగానే.. వారానికో ఎన్‌కౌంటర్. పదుల సంఖ్యలో అన్నలు హతమవుతున్నారు. గడిచిన 3 నెలల కాలంలో 130 మంది మావోలను లేపేశాయి ఆర్మ్‌డ్ ఫోర్సెస్. తుపాకుల గర్జనతో అడవుల్లో మరణమృదంగం మోగుతోంది. జవాన్ల టార్గెట్‌గా ల్యాండ్‌మైన్లు పెడుతున్నా.. బలగాలు ముందే పసిగడుతున్నాయి. అంత పక్కాగా సాగుతోంది కూంబింగ్ ఆపరేషన్. వరుస మరణాలు, ఎదురుదెబ్బలతో మావోయిజం అల్లకల్లోలం అవుతోంది. ఎర్రజెండాలు భయంతో వణికిపోతున్నట్టున్నాయి. అమిత్ షా దెబ్బకు ఉలిక్కిపడుతున్న మావోయిస్టులు.. లేటెస్ట్‌గా శాంతి చర్చలకు సిద్ధం అంటూ ముందుకొచ్చాయి. వందలాది మంది కామ్రేడ్లు నేలకొరిగాక.. ఉద్యమమే తుడిచిపెట్టుకుపోతుంటే.. ఇంతటి క్లిష్ట సమయంలో.. ఇంత ఆలస్యంగా శాంతి వచనాలు పలికితే ప్రయోజనం ఉంటుందా? అందుకు, అమిత్ షా ఒప్పుకుంటారా?
శాంతికి మావోయిస్టుల పిలుపు
శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని లేఖలో కోరారు. సానుకూలంగా స్పందిస్తే కాల్పులను విరమిస్తామని.. శాంతి చర్చలకు సానుకూల వాతావరణం సృష్టించాలని లేఖలో కోరారు అభయ్.
ఆపరేషన్ కగార్‌తో అన్నలు ఆగమాగం
ఆపరేషన్ కగార్ పేరుతో సీఆర్పీఎఫ్, కోబ్రా, ప్రత్యేక బలగాలు కలిసికట్టుగా స్పెషల్ కూంబింగ్ చేస్తు్న్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్‌ను డైరెక్ట్‌గా డీల్ చేస్తున్నారు. అబూజ్‌మడ్‌లో మావోయిస్టులను ఏరిపారేస్తున్నారు. గత నెలలో ఒకే ఎన్‌కౌంటర్లో 30 మందికి పైగా మావోలు మరణించారు. ఆ తర్వాత మరో 10 మంది హతమయ్యారు. ఇలా ఫిబ్రవరిలో 40 మంది.. జనవరిలో 48 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు చంపేశాయి. గతేడాది ఛత్తీస్‌గడ్, దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్స్‌లో ఏకంగా 235 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎప్పటికప్పుడు ఈ నెంబర్ పెరుగుతూనే పోతోంది. ఒకప్పుడు 14 రాష్ట్రాల్రలో ఉన్న మావో ఉద్యమం.. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌కు మాత్రమే పరిమితమైంది.
హిడ్మా కోసమే ఈ ఎత్తుగడనా?
కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో టార్గెట్‌గా పోలీస్ బలగాలు అడవుల్ని జల్లెడ పడుతున్నాయి. అయితే, ఎంత గాలిస్తున్నా.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మాత్రం చిక్కడు దొరకడు టైప్‌లో తప్పించుకుంటూనే ఉన్నాడు. కేంద్ర బలగాలకు చుక్కలు చూపిస్తున్నాడు. అబూజ్‌మడ్‌లో ప్రస్తుతానికి ఫుల్ యాక్టివ్‌గా ఉన్నది హిడ్మా ఒక్కడే. అతని కోసమే పోలీస్ వేట. ఎంతగా వెంటాడినా.. కుక్కలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలించినా.. హిడ్మా మాత్రం దొరకట్లే. అతని కోసం ఏకంగా 125 గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. హిడ్మా హతమైతే.. ఇక దండకారణ్యంలో మావోయిజం అంతమైనట్టే. బహుషా అందుకే కాబోలు.. సడెన్‌గా మావోయిస్టులు శాంతి ప్రతిపాదనలో ముందుకొచ్చారు. కాల్పులు ఆపేస్తే.. తాము చర్చలకు వస్తామంటూ డీల్ తీసుకొచ్చారు. ఈ ఎత్తుగడ హిడ్మాను కాపాడుకోవడానికేనా? భద్రతా బలగాలది అప్పర్ హ్యాండ్‌గా ఉన్న ప్రస్తుత తరుణంలో కాల్పుల విరమణకు కేంద్రం ఒప్పుకుంటుందా? అమిత్ షా అంత అమాయకుడా? చూడాలి ఏం జరుగుతుందో. కేంద్రం నో చెబితే మాత్రం.. అమిత్ షా చెప్పినట్టే వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టులు మటాష్.