అనంత్ అంబానీ. పరిచయం అక్కర్లేని పేరు. ముకేష్ అంబానీ తనయుడు, ధీరూబాయ్ అంబానీ మనవడు.. అంటూ ఆయన్ను పరిచయం చేయాల్సిన పని అస్సలు లేదు. దేశంలో అత్యంత ఖరీదైన వివాహం ద్వారా ఆమధ్య సెన్సేషనల్ అయ్యారు అనంత్ అంబానీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీని ‘వంతార’ అనే తన ప్రైవేట్ ‘జూ’కి ఆహ్వానించి ఒక రోజంతా ఆయనతోనే ఉండి ఆ విశేషాలు పంచుకున్నారు. తాజాగా అనంత్ అంబానీ తన పాదయాత్రతో దేశవ్యాప్తంగా మరో సంచలనం సృష్టించారు.
ద్వారకలో పుట్టినరోజు వేడుకలు
అనంత్ అంబానీకి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. అలాంటి సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు సహజంగా రాజకీయ పాదయాత్రలు చేస్తుంటారు. కానీ అనంత్ అంబానీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన చేస్తున్న పాదయాత్రకి కూడా రాజకీయాలతో సంబంధం లేదు. అది ఓ ఆధ్యాత్మిక పాదయాత్ర. అవును, తన 30వ పుట్టిన రోజునాటికి ద్వారక చేరుకునే విధంగా ఆయన జామ్ నగర్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఏప్రిల్-10న అనంత్ 30వ పుట్టినరోజు ఆరోజు ఆయన ద్వారక చేరుకోవాల్సి ఉంది.
రాత్రిపూట మాత్రమే యాత్ర..
మార్చి 27న అనంత్ అంబానీ తన పాదయాత్ర ప్రారంభించారు. జామ్ నగర్ నుంచి ద్వారకకు 140 కిలోమీటర్లు ఆయన కాలి నడకన యాత్ర చేస్తున్నారు. రోజుకి 15 నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే ఆయన యాత్ర చేస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి రోడ్డుపైకి వచ్చి యాత్ర చేస్తే ట్రాఫిక్ కదులుతుందా..? కచ్చితంగా ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులు కూడా రోజుకి కొంత మేర మాత్రమే ప్రధాన రహదారుల్లో యాత్ర చేస్తారు కాబట్టి వారికి అది చెల్లుబాటవుతోంది. కానీ అనంత్ అంబానీ వెళ్లేదంతా ప్రధాన రహదారి కావడంతో ఆయన సరికొత్తగా ఈ యాత్రను డిజైన్ చేసుకున్నారు. ప్రతి రోజూ కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఆయన రోడ్డుపైకి వస్తున్నారు. తెల్లవారు ఝామున తన యాత్ర ముగిస్తున్నారు. ఇలా రోజుకి కేవలం 15నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే ఆయన తన యాత్ర కొనసాగిస్తున్నారు.
మందీమార్బలం..
అంబానీ వెంట దాదాపుగా 100 మంది సిబ్బంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కొంతమంది ఆయన ఏర్పాట్లు చూసుకుంటున్నారు, మరికొందరు దారిలో వాహనాల్లో ఆయన్ను ఫాలో అవుతున్నారు. ఇంకొందరు ప్రైవేట్ సెక్యూరిటీ. ఇలా అనంత్ అంబానీ కోసం 100మంది సిబ్బంది కూడా యాత్ర చేస్తున్నట్టయింది. అయితే దారి పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరంతా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు పడకుండా కేవలం రాత్రిపూట మాత్రమే అనంత్ అంబానీ యాత్ర చేస్తున్నారు. పగలు హోటల్స్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.
ఏప్రిల్ 8నాటికి అనంత్ భార్య రాధికా మర్చంట్ ద్వారక చేరుకుంటారు. ఒకరోజు అటు ఇటుగా అనంత్ అంబానీ కూడా ద్వారకకు పాదయాత్ర ద్వారా వెళ్తారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ 30వ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ ద్వారకలో పూజలు నిర్వహిస్తారు. అధిక బరువు సమస్య అయినా, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అనంత్ అంబానీ ప్రతి రోజూ పాదయాత్రలో 10 నుంచి 15 కిలోమీటర్లు నడవటం నిజంగా ఆశ్చర్యమేనంటున్నారు. ఆయన విల్ పవర్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు.