Arvind Kejriwal Bail Conditions| ఢిల్లీ మద్యం పాలసీ సిబిఐ విచారణ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. సుప్రీం కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. హర్యాణా అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరగనుండగా.. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ జైలు నుంచి ఎన్నికల ప్రచారానికి అందుబాటులో ఉండడంతో ఆప్ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూర్యకాంత్ షరతులు విధించారు.
సిఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కు షరుతులివే
సిఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ మద్యం పాలసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కేసులో ఇంతకుముందే బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు సిబిఐ విచారణ కేసులో కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంతకుమందు బెయిల్ కు ఏ షరుతులు విధించిందో.. అవే షరతులు ఈసారి కూడా విధించింది.
-ముఖ్యంగా మద్యం పాలసీ కేసు పై బహిరంగంగా కేజ్రీవాల్ ఎక్కడా వ్యాఖ్యలు చేయకూడదు.
-ట్రయల్ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది గనకు విచారణ సమయంలో ట్రయల్ కోర్టుతో సహకరించాలి.
-ముఖ్యమంత్రి కార్యాలయంలో కేజ్రీవాల్ అడుగుపెట్టకూడదు.
-సెక్రటేరియట్ కు వెళ్లి ఎటువంటి అధికారిక ఫైల్స్ పై సంతకం చేయకూడదు. ఈ షరతుపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. చివరికి ఆయన కూడా ఈ షరతుపై అంగీకరించారు.
-ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సాక్ష్యులుగా ఉన్నవారిని కేజ్రీవాల్ ఏ విధంగాను సంప్రదించకూడదు. ఏదైనా అవసరమైతే ముందు ట్రయల్ కోర్టుకు చెప్పాలి.
– రూ.10 లక్షల బాండ్ సెక్యూరిటీ, ఇద్దరు ష్యూరిటీ గా ఉండాలి.
సిబిఐ విచారణ కేసులో కేజ్రీవాల్ అరెస్టు చట్టపరంగా జరగలేదని ఆయన లాయర్ వాదించారు. ఆయనకు రెగులర్ బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తులను కోరారు. అయితే బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read: సీనియర్ అధికారిపై రేప్ కేసు పెట్టిన మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్!
జస్టిస్ సూర్యకాంత్ ఏం చెప్పారు?
కేజ్రీవాల్ అరెస్టులో ఎటువంటి చట్ట ఉల్లంఘన జరగలేదని.. సిఆర్‌పిసి చట్టం, సెక్షన్ 41A ప్రకారమే ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ”అయితే కేసు విచారణ సుదీర్ఘ కాలం జరుగనుందని భావించి ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నాం. వ్యక్తి స్వేచ్ఛను హరించడం చట్టపరంగా సరికాదు అలా చేస్తే న్యాయ విచారణ అనే పదాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుంది. పైగా బెయిల్ మంజూరు చేసేందుకు కఠిన షరతులు విధించడం జరిగింది.” అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఏం చెప్పారు?
కేజ్రీవాల్‌ని సిబిఐ అధికారులు అరెస్టు చేసిన సమయాన్ని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తప్పుబట్టారు. ”ఈడీ కేసులో కేజ్రీవాల్ కు రెగులర్ బెయిల్ లభించిన వెంటనే సిబిఐ ఆయనను అరెస్టు చేసింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలంటే సిబిఐ అధికారులకు ఇంతకుముందే 22 నెలల సమయం ఉంది. కానీ అప్పుడు చేయలేదు. దీనిబట్టి సిబిఐ తీరుపై అనుమానం కలుగుతోంది. కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారుల వద్ద సరిపడ కారణాలు కనిపించడం లేదు. కేవలం ఆయనను సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచాలని ఉద్దేశంతోనే అరెస్టు చేశారని అనిపిస్తోంది. సిబిఐ తన తీరుని మార్చుకోవాలి.” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.