Nisikant Dubey Marathi| ముంబైలో హిందీ-మరాఠీ భాషా వివాదం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే.. శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరేలపై తీవ్ర విమర్శలు చేశారు. మరాఠీ మాట్లాడని వారిని లక్ష్యంగా చేసుకొని థాకరే సోదరులు విమర్శులు చేస్తున్నారు. అలాగే చిన్న వ్యాపారులు, ఉద్యోగులపై థాకరే సోదరుల అనుచురులు దాడులు చేస్తున్నారని నిశికాంత్ దూబే ఆరోపించారు. పేదవారిపై కాదు ధైర్యముంటే అంబానీ లాంటి వారిపై, ముస్లింలపై దాడులు చేయాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“మీరు పేదవారిని కొడతారు, కానీ ముంబైలో నివసించే ముఖేష్ అంబానీ మరాఠీ ఎక్కువగా మాట్లాడరు, ఆయన దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఎదుర్కోండి. మహీమ్ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది, అక్కడికి వెళ్లి చూడండి. ఎస్బీఐ చైర్మన్ కూడా మరాఠీ భాషలో పెద్దగా మాట్లాడరు, ఆయనపై చేయి ఎత్తే ధైర్యం మీకు ఉందా?” అని దుబే సవాల్ విసిరారు.
అలాగే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడిన విషయాన్ని ప్రతిపక్ష నాయకులు వక్రీకరించారని చెప్పారు. “మహారాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థలో గొప్ప పాత్ర వహిస్తోంది. నేను చెప్పిన మాటలను తప్పుగా వ్యాఖ్యానించారు. ముంబై, మహారాష్ట్ర నుంచి వచ్చే పన్నుల్లో మాకూ ఒక భాగం ఉంది. ఇది థాకరే కుటుంబంతో లేదా మరాఠీలతో సంబంధం లేని విషయం. ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థలు ముంబైలో ప్రధాన కార్యాలయాలు కలిగి ఉన్నాయి, అవి పన్నులు చెల్లిస్తాయి,” అని ఆయన వివరించారు.
ఈ వివాదానికి మూలం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలే. రాజ్ థాకరే తన పార్టీ కార్యకర్తలకు మరాఠీ మాట్లాడని వారిని “కొట్టండి, కానీ వీడియో తీయొద్దు” అని సూచించినట్లు తెలిసింది. దీనిపై స్పందిస్తూ, దుబే తీవ్రంగా మండిపడ్డారు. “మీరు ఎవరి డబ్బుతో జీవిస్తున్నారు? మీరు మా డబ్బుతో బతుకుతున్నారు. మహారాష్ట్రలో ఏ రకమైన పరిశ్రమలు ఉన్నాయి? ఖనిజాలు జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉన్నాయి. మీ వద్ద ఏ గనులు ఉన్నాయి? సెమీకండక్టర్ రిఫైనరీలు అన్నీ గుజరాత్‌లో ఉన్నాయి,” అని ఆయన ప్రశ్నించారు.
హిందీ మాట్లాడే వారిపై దాడులు చేసే ధైర్యం ఉంటే.. ఉర్దూ, తమిళం, తెలుగు మాట్లాడే వారిని కూడా కొట్టాలని దుబే సవాల్ చేశారు. “మీరు అంత గొప్పవారైతే, మహారాష్ట్ర నుంచి బయటకు వచ్చి బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఈ ధైర్యం చూపించండి. మిమ్మల్ని అక్కడ కొట్టి పడేస్తారు,” అని ఆయన హెచ్చరించారు.
ఈ వివాదం.. ఎంఎన్ఎస్ కార్యకర్తలు ముంబైలో మరాఠీ మాట్లాడని కొందరు వ్యాపారులపై దాడి చేయడంతో మొదలైంది. ఎంఎన్ఎస్ ముంబైలోని వ్యాపారులు, దుకాణదారులు తప్పనిసరిగా మరాఠీ మాట్లాడాలని డిమాండ్ చేస్తోంది. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఈ పరిస్థితిని నియంత్రించడానికి, మరింత ఉద్రిక్తతను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: బంగారం కొనుగోలు చేస్తే నష్టమే.. ETFలు బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఈ ఘటన భాషా రాజకీయాలు, ప్రాంతీయ గుర్తింపు, దేశంలో ఆర్థిక సహకారం వంటి అంశాలపై చర్చను రేకెత్తిస్తోంది. దుబే వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి, అయితే ఆయన తన వాదనలో మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాకుండా, దానికి దేశవ్యాప్తంగా ఉన్న సహకారాన్ని హైలైట్ చేసి వివాదానికి కొత్త కోణంలో తీసుకెళ్లారు.