Jandhan Accounts: మోదీ ప్రారంభించిన జన్‌ధన్ ఖాతాల గురించి ఈ మధ్యకాలంలో రకరకాల వార్తలు హంగామా చేశాయి. యాక్టివ్ లేని ఖాతాలను మూసి వేస్తున్నారంటూ ఒకటే ప్రచారం. ఇప్పడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ తీసుకొచ్చింది జన్‌ధన్ పథకం. దీనివల్ల ప్రజలు డబ్బు పొదుపు చేసుకోవడం, బ్యాంకు రుణాలు పొందడం దీని కాన్సెప్ట్. జన్‌ధన్ ఖాతాల జీరో బ్యాలన్స్‌తో ఓపెన్ చేయవచ్చు. చెక్కు సదుపాయం కావాలంటే అకౌంటులో కనీస బ్యాలెన్స్ ఉండాలి. జన్‌ధన్ ప్రతీ ఖాతాదారుడికి డెబిట్ కార్డు ఇస్తారు.
అంతేకాదు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం కూడా ఉంటుంది. కుటుంబంలో జన్‌ధన్ ఖాతాదారుడికి 10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. ఖాతాను ఆరు నెలలపాటు నిర్వహించిన తరవాత ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఇస్తారు. తొలుత ఐదు వేల ఓవర్ డ్రాఫ్ట్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని రెట్టింపు చేశారు.
ప్రభుత్వ సబ్సిడీలు, నగదు చెల్లింపులను నేరుగా జన్‌ధన్ ఖాతాల ద్వారా పంపిణీ చేస్తోంది కేంద్రం. పొదుపు ప్రాముఖ్యత, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించాల్సిన ఆవశ్యకత, బ్యాంకు సేవలను వినియోగించుకోవడం వంటి అంశాల గురించి ఖాతాదారులకు చెప్పడం జన్‌ధన్ పథకంలో భాగం. ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15న ఎర్రకోట నుండి దీనిపై ప్రకటన చేశారు.
ALSO READ: లులూ మాల్‌లో యువతిపై అఘాయిత్యం, మేనేజర్ అరెస్టు
అదే నెల ఆగస్టు 28న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. చాలా కాలంగా వాడకంలో లేని జన్‌ధన్ ఖాతాలను బ్యాంకులు క్లోజ్ చేస్తున్నాయంటూ ఇటీవల ప్రచారం జోరందుకుంది. దీనిపై ఆయా ఖాతాల్లో ఎక్కువ మంది మహిళల ఉన్నారు. వారిలో భయం మొదలైంది. ఆయా వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చేసింది.
ఖాతాలను మూసివేయడం లేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. బ్యాంకులు జన్‌ధన్ ఖాతాలను మూసివేయాలని ఎలాంటి ఆదేశాలు తాము ఇవ్వలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖాతా మూసివేతపై నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఆయా ఖాతాలను సురక్షితంగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.
జూలై 1 నుంచి మూడు నెలలు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్రం. యాక్టివ్‌లో లేని ఖాతాలను తిరిగి యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఖాతాదారులను బ్యాంకులు సంప్రదించనున్నట్లు అందులో భాగం. ఈ ప్రచారంలో KYC, కొత్త పథకాల నమోదు, ఖాతా అప్‌డేట్ వంటివి ఉండనున్నాయి.
జన్‌ధన్ ఖాతాల కీలక ప్రయోజనాల గురించి పేద ప్రజలు తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. రేషన్, విద్య, గ్యాస్ సబ్సిడీ, పింఛన్ ఇలా ప్రభుత్వ పథకాల నిధులు జన్‌ధన్ ఖాతాలోకి నేరుగా జమ అవుతాయి. జన్‌ధన్ ఖాతా ద్వారా రూపే ATM కార్డు ఇస్తారు. దీని ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు.
భారత ఆర్థిక వ్యవస్థలో జన్‌ధన్ ఖాతాలు కీలకమైన అడుగు. ప్రపంచంలో అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఉద్యమంగా నిలిచిందని బ్యాకింగ్ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 55 కోట్లకుపైగా జన్‌ధన్ ఖాతాలు ఉండగా, అందులో 56 శాతం మహిళల పేరిట ఉన్నాయి.ఈ ఏడాది మే నాటికి మొత్తం డిపాజిట్లు రూ. 2.5 లక్షల కోట్లు అన్నమాట.