Mamata Banerjee Supreme Court| పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దుచేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. న్యాయవ్యవస్థపై తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని.. అయినప్పటికీ ఈ తీర్పును అంగీకరించబోమని అన్నారామె.
ఈ దేశ పౌరురాలిగా నాకు ప్రతీ హక్కు ఉంటుంది. అలా.. మానవతా ధృక్పథంతో నా అభిప్రాయం తెలియజేస్తున్నా. న్యాయమూర్తులపై అపారమైన గౌరవం ఉన్నప్పటికీ ఈ తీర్పును నేను అంగీకరించబోను. అయినప్పటికీ ప్రభుత్వపరంగా కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం. స్కూల్ సర్వీస్ కమిషన్‌ను రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారామె. ఈ క్రమంలోనే ఢిల్లీ నోట్ల కట్టల జడ్జి(Delhi Notes Judge) అంశాన్ని ఆమె ప్రస్తావించారు.
ఒక హై కోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్‌ఫర్ చేసి సరిపెడతారా?. అదే టీచర్ల నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా?. అలాంటప్పుడు వీళ్లను(అభ్యర్థులను) ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదు అని మమతా ప్రశ్నించారు. అలాగే.. నియామకాల రద్దుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తొలి జడ్జి ఇప్పుడు బీజేపీ ఎంపీగా (అభిజిత్ గంగోపాధ్యాయను ఉద్దేశించి..) ఉన్నారని, ఈ తీర్పు వెనుక బీజేపీ, సీపీఎంల కుట్ర దాగుంది అని అన్నారామె. సుప్రీం కోర్టు ఉత్తర్వుల వెనుక రాజకీయ ఉద్దేశాలు తప్పకుండా ఉన్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ విద్యా వ్యవస్థ కుప్పకూల్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని మండిపడ్డారామె.
Also Read: ఉబర్, ఓలా, రాపిడోలపై నిషేధం.. హైకోర్టు సంచలనం
ఈ కుట్రలో బీజేపీ, సీపీఎం పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. కలకత్తా హైకోర్టులో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయమూర్తి ఇప్పుడు బీజేపీ ఎంపీ.. ఇది తప్పకుండా ఆ రెండు పార్టీల పనే అని అన్నారు. ఏప్రిల్ 7న బాధిత ఉపాధ్యాయుల సమావేశంలో తాను పాల్గొంటానని మమత బెనర్జీ ప్రకటించారు. ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు ఎవరూ ఆశ కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. మీరందరూ దరఖాస్తు చేసుకొండి.. నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూద్దామని అన్నారు.
హై కోర్టు ఉత్తర్వులపై సుప్రీం వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2016 సంవత్సరంలో జరిగిన 25 వేల మంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమకాలు మోసపూరితంగా జరిగాయని చెబుతూ.. ఆ నియామకాలను కలకత్తా హైకోర్టు(Calcutta High Court) గతంలో రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని ఇవాళ సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.
అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె. ఇది కేవలం 25 వేల మంది అభ్యర్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. వాళ్ల కుటుంబాలకు సంబంధించిన అంశమని అన్నారామె.