Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా అంటే అవుననే అంటున్నాయి అధికారపార్టీ వర్గాలు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి దాదాపు 16 నెలలు అవుతున్నా విస్తరణ ఎప్పుడు అంటే నేడో.. రేపో అంటున్నారు కాని అడుగు ముందుకు పడడం లేదు. గత పదిరోజులుగా క్యాబినెట్ విస్తరణకు ముహూర్తమే లేట్.. అన్నట్లు ప్రచారం జరిగింది. ఆశావహులు కూడా ఢిల్లీ చేరి ఎవరి లాబీయింగ్‌లు వారు చేసుకున్నారు … తీరా చూస్తే మళ్ళీ వాయిదా పడిందంటున్నారు. ఇంతకీ ఎందుకు ఈ వాయిదాల పర్వం? ఈ ఉత్కంఠ కు తెరపడేది ఎప్పుడు?
ఇటీవల రాహూల్‌తో తెలంగాణ కాంగ్రెస్ పెద్దల మీటింగ్
రేపే విడుదల అని అంటించే సినిమా పోస్టర్‌లా తయారయింది తెలంగాణ కేబినెట్ విస్తరణ. నిజానికి పది రోజుల క్రితం రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన రాష్ట్ర నేతల మీటింగ్ తర్వాత కేబినెట్ విస్తరణ దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని అందరూ భావించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌లు హైకమాండ్‌తో చర్చలు జరిపి రావడంతో .. ఉగాది లేదా ఏప్రిల్ 3 న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలే లీకులు ఇచ్చారు. తీరా టైమ్‌కు మళ్ళీ వాయిదా అంటూ మంత్రి పదవి ఆశావాహులకు ఏఐసీసీ నేతలు షాకిచ్చారు . దాంతో ఎందుకీ వాయిదాల పర్వం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద డిబేట్‌గా మారింది.
భర్తీ కావాల్సి ఉన్న 6 క్యాబినెట్ బెర్త్‌లు
మంత్రి వర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయివ. ఆ 6 స్థానాలను జిల్లా, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఆ రెండు ఈక్వేషన్తలు ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదట. దానికి ప్రధాన కారణం క్యాబినెట్ స్థానం కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ పడడమే అంటున్నారు. భర్తీ చేయాల్సిన 6 మంత్రి పదవులలో జిల్లా, కుల సమీకరణలతో ఒకటి లేదా రెండు మాత్రమే రెడ్డి సామాజిక వర్గం వారికి దక్కే అవకాశం ఉందంటున్నారు. కానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది.
పదవులు ఆశిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డిలు క్యాబినెట్ దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నాయకులు సైతం మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాట పడుతున్నాయి. వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌ల పేర్లు బీసీ సామాజిక వర్గం నుంచి పరిశీలనలో ఉన్నాయి. ఇక మాదిగ , లంబాడా ఎమ్మెల్యేలు మాకు అవకాశం కల్పించాలని ముకుమ్మడిగా కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాస్తున్నారంట.
సుదర్శన్‌రెడ్డి కోసం పట్టుబడుతున్న ముఖ్యమంత్రి
Also Read: జగన్ తాడేపల్లి ఆఫీస్‌కి TO LET.. నెక్ట్స్ పార్టీ క్లోజ్
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి , ఉమ్మడి నల్లగొండ నుంచి రాజగోపాల్ రెడ్డి ,ఉమ్మడి వరంగల్ నుంచి దొంతి మాధవ రెడ్డి , ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుదర్శన్‌రెడ్డి కోసం సీఎం పట్టుబడుతుండగా , దొంతి మాధవ రెడ్డి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాసారు.
ఖర్గే, కేసి వేణుగోపాల్‌లకు జానారెడ్డి లేఖ
క్యాబినెట్ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ కి జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ జిల్లాకు 4,5 మంత్రి పదవులు ఉండేవని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జానారెడ్డి రికమండ్ చేసిన నల్గొండ డీసీసీ అభ్యర్ధి శంకర్ నాయక్ పేరు అధిష్టానం ప్రకటించింది. దీంతో జానరెడ్డి లేఖపై రంగారెడ్డి జిల్లా నేతలు అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారట. మరోవైపు సామాజిక వర్గ సమీకరణలే అడ్డంకి అయితే.. తాను రాజీనామా చేస్తాననీ. ఏ కమ్యూనిటీకి మంత్రి పదవి ఇవ్వాలో ఆ వర్గం వారిని అక్కడ నిలబెట్టి గెలిపిస్తానని ప్రకటించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. దాన్నిబట్టి ఈ జిల్లాకు మంత్రి పదవి కావాలని నేతలు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది.
కన్‌ఫ్యూజన్‌లో పడి వాయిదా వేసిన హైకమాండ్
ఇలా అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటంతో అధిష్టానం కన్‌ఫ్యూజన్‌లో పడిందంటున్నారు. ఆ క్రమంలో అన్ని కోణాల్లో ఆలోచన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం ప్రకటించాలని డిసైడ్ అయిందంట. దాంతో క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం పట్టక తప్పదంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తాజాగా అదే విషయం స్పష్టం చేస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తాం..
విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తాం.. ఎవరికి ఇవ్వాలో మీరే చెప్పండి అని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ సూచించిందట. దాంతో ముఖ్య నేతలు ఒకొక్కరు ఒక్కో పేరు చెప్పడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చిందట. ఇలా అయితే కాదని తాము కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికల ముందు పార్టీలోకి తిరిగొచ్చే సమయంలో మాటిచ్చామని .. కాబట్టి రాజగోపాల్‌రెడ్డి కి మంత్రి పదవి ఇస్తామని ఏఐసీసీ పెద్దలు ప్రతిపాదించారంట. అయితే ఈ నిర్ణయానికి రాష్ట్ర నేతలు ససేమిరా అనడంతో.. ఏప్రిల్ రెండో వారంలో మరోసారి మాట్లాడుదామని హైకమాండ్ స్పష్టం చేసిందంట.
కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరిగి అలసిపోతున్న ఆశావహులు
మొత్తం గా సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాలు ఏ మాత్రం వర్కవుట్ కాకపోవడంతో కేబినెట్ విస్తరణ రేపే విడుదల సినిమా పోస్టర్‌లా మారిందంటున్నారు. ఇటు ఆశావాహులు కూడా ఢిల్లీ తో పాటు. రాష్ట్ర నేతల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారట. ఇక ఎప్పుడైనా చేయండి అంటూ ఎవరి నియోజకవర్గాలకు వారు చేరుకుంటున్నారంట. చూడాలి మరి తెలంగాణ కేబినెట్ విస్తరణ సీరియల్‌ను ఏఐసీసీ ఇంకా ఎంతకాలం పొడిగిస్తుందో