Modi : భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. ఈ విషయం అనేక సర్వేల్లోనూ తేలింది. మోదీ ఏ దేశానికి వెళ్లినా ఘన స్వాగతం లభించడం ఎన్నోసార్లు చూశాం. తాజాగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. ప్రధాని మోదీని ఆటోగ్రాఫ్ అడిగారని తెలుస్తోంది.
ప్రస్తుతం జీ7 శిఖరాగ్ర సమావేశాల కోసం భారత్ ప్రధాని జపాన్ లో పర్యటిస్తున్నారు. వివిధ దేశాధినేతలతో మోదీ వ్యక్తిగతంగా ముచ్చటించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మోదీ ముందుంచారని తెలుస్తోంది. బైడెన్ ఆహ్వానంతో వచ్చే నెలలో భారత్ ప్రధాని అమెరికా టూర్ వెళ్లనున్నారు. మోదీ పాల్గొనే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని బైడెన్ చెప్పారట. తనకు అనేక వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని మోదీకి బైడెన్ తెలిపారని సమాచారం. తానెప్పుడూ కలవని వ్యక్తులు, పరిచయం లేని వారు కూడా ఫోన్లు చేసి మోదీతో కలిసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారని సమాచారం.
ఆ సమయంలో అక్కడి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తాను కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నానని చెప్పారని సమాచారం. సిడ్నీలో మోదీ ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమకు అవకాశం కల్పించాలని అనేక మంది తనకు వ్యక్తిగతంగా సందేశాలు పంపుతున్నారని మోదీతో ఆల్బనీస్ అన్నారని తెలుస్తోంది. మోదీ పాల్గొనబోయే వేదిక సామర్థ్యం 20 వేలు మాత్రమే. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని ఆల్బనీస్ చెప్పినట్లు సమాచారం.
ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడిన తర్వాత మళ్లీ బైడెన్ మోదీతో సంభాషణ కొనసాగించారట. నిజంగా తనకు చాలా పెద్ద సమస్యను సృష్టించారని మోదీతో సరదాగా వ్యాఖ్యానించారని విశ్వసనీయవర్గాల సమాచారం. తాను సరదాగా అనడం లేదని కావాలంటే తన అధికార బృందాన్ని అడగాలని కూడా బైడెన్ అన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని మోదీతో బైడెన్ అన్నారని సమాచారం. గతంలో అమెరికాలో మోదీ పర్యటించిన సమయంలో విశేష ఆదరణ లభించింది.