Jagdeep Dhankar: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిపుట్టిస్తున్నాయి. మంగళవారం సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ప్రతిపక్ష ఇండియా కూటమి షాకిచ్చింది. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ.. ధన్‌ఖడ్‌ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించిన అవిశ్వాస తీర్మానంపై ఇండియా కూటమికి చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
విపక్ష పార్టీ తీర్మానం బలపరచాలంటే 50 మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67-B ప్రకారం ఈ తీర్మానంపై సంతకం చేశారు. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆమోదం అవసరం. అయితే ఓటింగ్ జరగాలంటే కనీసం 50 శాతం ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు 231 అయితే.. అందులో ఎన్డీఏ కూటమి బలం 119గా ఉంది. ఇండియా కూటమికి 85 మంది.. ఇతరులు 27 మంది ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 116 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంది.
Also Read: అబ్బా.. ఏమి క్రేజ్ సామి.. మరోసారి ట్రెండ్ సెట్ చేసిన సేనాని
లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జి.వి.మౌలాంకర్, 1966 నవంబర్ 24న హుకం సింగ్, 1987 ఏప్రిల్ 15న బలరాం జక్కడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. మౌలాంకర్, బలరాం జక్కడ్‌పై తీర్మానాలు వీగిపోయాయి. హుకుం సింగ్‌పై ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి 50 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు సముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది సభ్యులు అంగీకరించాలి. మరి ఇప్పుడు జగదీప్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.