Bangladesh bans export of padma hilsa to India this festive season: పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ దుర్గాపూజ పశ్చిమ బెంగాల్ సంస్కృతిలో ఒక భాగం. ఈ దుర్గాపూజ వేడుకలు అక్టోబర్ రెండో వారంలో జరగనున్నాయి. బెంగాల్‌లో జరిగే ఈ దుర్గాపూజ ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనవి. ఇందులో భాగంగా దుర్గాబాతకు నైవేద్యంగా చేపలను కూడా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
భక్తులు ప్రతీ ఏడాది పెద్ద మొత్తంలో పద్మా హిల్సా చేపలను బంగ్లాదేశ్ దేశం నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఈ చేపలకు బంగ్లాదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చేపలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఉండేవి కావు. ప్రతీ ఏటా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు భారత్‌కు బంగ్లాదేశ్ నుంచి పెద్దఎత్తున చేపలు ఎగుమతి జరుగుతుండేవి. కానీ షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దుర్గాపూజ సమీపిస్తున్న వేళ.. బెంగాల్ వాసులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పద్మా హిల్సా చేపలను ఎగుమతి చేయడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పద్మా హిల్సా చేపల కొరత ఏర్పడనుంది. తమ దేశంలో ఈ చేపల ధరలను నియంత్రించడంలో భాగంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆ దేశ మత్స్య శాఖ సలహాదారుడు ఫరీదా అఖ్తర్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
బంగ్లాదేశ్‌లో ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో భారత్ వ్యతిరేక సెంటిమెంట్ ఏర్పడిందని, ఈ క్రమంలోనే పద్మా హిల్సా చేపల ఎగుమతిపై బ్యాన్ విధించాలని పలువురు పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ధరలు ఇంకా తగ్గలేదన్నారు. ఇటీవల హిల్సా ధర కిలోకు టీకే 1,600 ఉండగా.. ప్రస్తుతం టీకే 1800 నుంచి టీకే 1900 వరకు పెరిగిందని నివేదిక పేర్కొంది.
Also Read: పట్టాలపై సిమెంట్ దిమ్మెలు.. అజ్మీర్ లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర
ఇదిలా ఉండగా, గతేడాది హసీనా ప్రభుత్వం దుర్గాపూజ సందర్భంగా 3,950 టన్నుల హిల్సాను దేశానికి పంపేందుకు 79మంది చేపల ఎగుమతిదారులను అనుమతి ఇచ్చింది. అయితే, బంగ్లాదేశ్‌లో ప్రధాని పదవిని తొలగించిన తర్వాత షేక్ హసీనా పారిపోయి భారతదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, హసీనాను అప్పగించాలని ఢాకా నుంచి కోరారు. అంతకుముందు జరిగిన హింసల్లో దాదాపు 300 మంది మరణించారు.