చేతికి కట్టు, నుదుటిపై బ్యాండేజ్ తో ఇటీవల ఓ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. కన్నడంలో మాట్లాడలేదని తమపై కొంతమంది దాడి చేశారంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ శిలాదిత్య బోస్. తన కారుకి బైక్ ని అడ్డుగా పెట్టి అడ్డుకుని తనని కొట్టారని, కారులో ఉన్న తన భార్యపై కూడా దాడిచేయబోయారని, కర్నాటక రాష్ట్రం అంటే తనకెంతో గౌరవం ఉండేదని, బెంగళూరులో ఇలా జరగడం దారుణం అని ఆ వీడియోకి మరింత మసాలా దట్టించాడు. చివరకు దీన్ని ప్రాంతీయ విద్వేషంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. హిందీ మాట్లాడే వాళ్లకు కన్నడిగులకు మధ్య చిచ్చుపెట్టాలని కూడా చూశాడు. సోషల్ మీడియా కూడా ఈ వీడియోని వన్ సైడ్ గా అర్థం చేసుకుంది. ఆ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కి మద్దతిచ్చింది. కర్నాటకలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తారా అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఇది రెండు ప్రాంతాల మధ్య మంటపెట్టేలా మారింది.
దేశముదురు శిలాదిత్య..
శిలాదిత్య సోమవారం ఈ వీడియో విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో వదిలిన వీడియో ప్రకారం శిలాదిత్ అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ బాధితుడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్ లో అతడే నిందితుడు. తన కారుకి అడ్డుగా వచ్చాడని బైకర్ పై దాడి చేశాడు శిలాదిత్య. కానీ చివరకు తానే బాధితుడి అవతారం ఎత్తి. తలకి చేతికి కట్లు కట్టుకుని, ముక్కుకి ప్లాస్టర్ వేసుకుని సోషల్ మీడియాలో వీడియో వదిలాడు, సింపతీకోసం ట్రై చేశాడు.
అసలేం జరిగింది..?
సోమవారం ఉదయం శిలాదిత్య, అతని భార్య కారులో సివి రామన్ నగర్ నుంచి విమానాశ్రయానికి వెళ్తున్నారు. శిలాదిత్య భార్య మధుమిత దాస్ స్క్వాడ్రన్ లీడర్ కావడం విశేషం. ప్రమాదం జరిగిందని చెబుతున్న సమయంలో ఆమె కారు డ్రైవ్ చేస్తున్నారు. మధ్యలో కారు ఒక బైక్ ని ఢీకొంది. వెంటనే కారులోనుంచి దిగిన శిలాదిత్య బోస్.. బైకర్ వికాస్ పై దాడి చేశాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత శిలాదిత్య తన కార్ లో భార్యతో కలసి ఎయిర్ పోర్ట్ కి వెళ్లి, అక్కడినుంచి కోల్ కతాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు సింపతీకోసం రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ కేసుని తప్పుదారి పట్టించాడు.
వికాస్ వెర్షన్ ఏంటి..?
దాడి జరిగిన సమయంలో బైకర్ వికాస్ తల్లి కూడా అక్కడే ఉన్నారు. కారులోనుంచి దిగిన శిలాదిత్య బోస్ తన కొడుకుని గాయపరిచాడని, చేయి కొరికాడని, కిందపడేసి కొట్టాడని ఆమె ఆరోపించారు. ఫోన్ కూడా పగలగొట్టాడని ఆమె అన్నారు. ఈ ఆరోపణలకన్నిటికీ రుజువులు కూడా ఉన్నాయి. బైకర్ వికాస్ పై శిలాదిత్య బోస్ దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
The other side of the IAF officer – biker road rage story. Man is seen brutally pushing the bike rider to ground & kicking him multiple times. He is also seen trying to chokehold the rider. In another video, the officer is seen throwing the rider's phone to ground to break it pic.twitter.com/KGViUwDJ8q
— Harish Upadhya (@harishupadhya) April 21, 2025
పరారీలో బోస్..
ఇద్దరు వ్యక్తుల మధ్య రోడ్డుపై జరిగిన గొడవ ఇది. అయితే భాషా విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈ గొడవని పెద్దది చేసేందుకు, తనని తాను బాధితుడుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సింపతీ సృష్టించుకునేందుకు శిలాదిత్య బోస్ సోషల్ మీడియాలో వీడియోలు వదిలారు. పోలీసుల్ని కూడా తప్పుదారి పట్టించారు. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. కార్ డ్యాష్ బోర్డ్ వీడియోని సమర్పించాల్సిందిగా బోస్ భార్యకు కబురు పెట్టారు. కానీ ఆమె ఆ వీడియోని ఇచ్చేందుకు ఇష్టపడటంలేదు. పాస్ వర్డ్ తన భర్త వద్ద ఉందని, ఆయన కోల్ కతా వెళ్లారని చెప్పారు. దీంతో దాడి విషయంలో తప్పంతా శిలాదిత్య బోస్ దే అని పోలీసులు నిర్థారణ చేసుకున్నారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బోస్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
#WATCH | Karnataka | IAF Wing Commander Shiladitya Bose and his wife Squadron Leader Madhumita Das allegedly assaulted in a road rage incident in Bengaluru | D Devaraj, DCP East Bengaluru, says, "… This is not a case related to any language or reason. This is very clear from… pic.twitter.com/gJeDZgFtcK
— ANI (@ANI) April 21, 2025
అతిగా స్పందించొద్దు..
శిలాదిత్య బోస్ పోస్ట్ చేసిన వీడియోలు చాలామంది నిజమేనని నమ్మారు. అదే సమయంలో సోషల్ మీడియాలో హిందీ, కన్నడ గ్రూప్ ల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఒక దశలో బెంగళూరులో ఉంటున్న స్థానికేతరులు ఆందోళనపడ్డారు కూడా. కానీ బెంగళూరులో ఇలాంటి ప్రాంతీయ గొడవలు జరగవని అంటున్నారు స్థానికులు. ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగిల్చే అలాంటి వ్యక్తులకు అనవసర ప్రచారం ఇవ్వొద్దని అభ్యర్థిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకుని సోషల్ మీడియాలో వచ్చే వీడియోలపై స్పందించాలని అంటున్నారు.