Bihar Crime : బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని ససారంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో మెట్రిక్యులేషన్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరగగా, ఓ పదో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థి కాలికి, మరొక విద్యార్థి వీపునకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఇంకో విద్యార్థికి బుల్లెట్ గాయం కారణంగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో.. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హైవేను దిగ్బంధించారు. ఈ ఘనటపై స్పందించిన పోలీసులు.. ఈ కేసులో చర్యలు తీసుకుంటామని, నిందితుల్ని అరెస్టు చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం తీసుకెళ్లారు.
విద్యార్థుల మధ్య విభేధాలు ఎక్కడ వచ్చాయి, ఎందుకు కాల్పుల ఘటన వరకు వెళ్లాయనే విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసు అధికారులు ఇంకా అధికారిక సమాచారం అందించడం లేదని స్థానిక మీడియా వెల్లడిస్తోంది. కాగా.. ఈ రాష్ట్రంలో మాస్ కాపీయింగ్ నిత్యం జరిగే విషయమే. అన్నీ పరీక్షల్లో విద్యార్థులు దారుణంగా కాపీలు కొడుతుంటారు. ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై దాడులకు పాల్పడిన ఘటనలకు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల మధ్య కాల్పుల ఘటన అక్కడ సాధారణం కంటే కాస్త ఎక్కువే కానీ, ఆశ్చర్యం కాదంటూ చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఫిబ్రవరి 25 వరకు బీహార్ బోర్డు పరీక్షలు
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BSEB) 10వ తరగతి మెట్రిక్ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9 గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఆ తర్వాత అధికారులు ఎవరినీ లోపలికి అనుమతించజం లేదు. రెండో షిఫ్ట్ కోసం, మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 గంటల వరకు ప్రవేశాన్ని అనుమతిస్తున్నారు.
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ప్రారంభం
ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫిబ్రవరి 15న 10వ తరగతి, 12 తరగతులకు బోర్డు పరీక్షలను ప్రారంభించింది. కాగా.. కాల్పుల ఘటన జరిగినప్పుడు 10వ తరగతి ఇంగ్లీష్, 12వ తరగతి విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. 10వ తరగతి పరీక్ష 7,780 కేంద్రాలలో నిర్వహిస్తుండగా, 23.86 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 12వ తరగతి పరీక్ష 995 కేంద్రాలలో దాదాపు 23,000 మంది విద్యార్థులు హాజరైనట్లు రాష్ట్ర స్థాయి అధికారులు వెల్లడించారు. కాగా.. అన్నీ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగానే నిర్వహించినట్లు CBSE పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యామ్ భరద్వాజ్ వెల్లడించారు.
Also Read : UP Budget Scooty : స్టూడెంట్స్ కి ఫ్రీ స్కూటీ – ఆ ప్రభుత్వం సూపర్ స్కీమ్