Bihar Politics: బీహార్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతోంది. సీట్లపై ఎడతెగని పంచాయితీ సాగడంతో ఆర్జేడీ నోరు విప్పింది. అన్నిసీట్లకు తాము పోటీ చేస్తున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ప్రకటించారు. దీంతో ఆ వ్యవహారంలో బీహార్ అంతటా హాట్ టాపిక్‌గా మారింది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీహార్ ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్-ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీలో 243 స్థానాలకు ఆర్జేడీ పోటీ చేస్తుందని ప్రకటించారు.ముజఫర్‌పూర్‌లోని కాంతిలో జరిగిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.
మేము తిరిగొస్తామని, ఓటర్లు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. ముజఫర్‌పూర్, బోచహాన్, గైఘాట్ , కాంతి ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలో ఈ సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఈ విషయంలో కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. తేజస్వి ప్రకటనతో కూటమి పార్టీల నేతలు షాకయ్యారు. తేజస్వి ప్రస్తావించిన ముజఫర్‌పూర్ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆధీనంలో ఉంది.
సీట్ల పంపకాల సమయంలో కూటమి భాగస్వాములపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఈ స్టేట్‌మెంట్ చేశారనే ఊహాగానాలు లేకపోలేదు. ఇదే సమయంలో ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో తేజస్వి విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం నినాదాలతో ప్రజలను మభ్యపెడుతోందని, అలాంటి ఎత్తుగడలు పని చేయవన్నారు.
ALSO READ: సినిమా స్టయిల్లో కారులో ప్రియురాలికి తాళి కట్టిన ప్రియుడు
బీహార్ నుంచి ఓట్లు.. గుజరాత్‌లో ఫ్యాక్టరీలంటూ వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధి దృష్టి సారిస్తుందని చెప్పకనే చెప్పారు. తేజస్వి యాదవ్ ప్రకటన రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొన్నిరోజుల కిందట మహాఘట్బంధన్ కూటమి సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా సమాధానం ఇవ్వలేదు.
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీఐపీ, జెఎంఎం, ఎల్జెపి (పరాస్ వర్గం) మహాఘట్‌బంధన్ కూటమిలో భాగస్వాములు. అయితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లను కోరుతున్నట్లు అక్కడి నేతల మాట. ఈ క్రమంలో తేజస్వి ఈ ప్రకటన చేశారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 సీట్లకు గాను 75 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేస్తే కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది.
ఈసారి బీహార్‌లో పరిస్థితులు మారాయని అంటున్నాయి అక్కడి పార్టీలు. ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తోంది. రాహుల్ నాయకత్వంలో పార్టీ బలపడిందని ఆ పార్టీ నేతల మాట. ఈసారి జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూటమిలో భాగమయ్యాయి. తేజస్వి వ్యాఖ్యల నేపథ్యంలో రేపోమాపో సీట్లపై ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.