Delhi CM: ఎట్టకేలకు ఢిల్లీ పీఠం సస్పెన్స్ వీడింది. బుధవారం జరిగిన బీజేఎల్పీ సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోవడంతో, సస్పెన్స్ కు తెర పడిందని చెప్పవచ్చు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల సమయం నుండి సీఎం ఎవరనే ప్రశ్నలకు బుధవారం సమాధానం దొరికింది. బీజేఎల్పీ నేతగా రేఖా గుప్తాను ఎన్నుకోవడంతో, సీఎంగా ఆమె గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే సమావేశంలో రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది.
ఢిల్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు విజయాన్ని అందుకోగా, పార్టీలో కొత్త ఉత్సాహం నిండిందనే చెప్పవచ్చు. అయితే సీఎం సీటు ఎవరికి దక్కుతుందోనన్న కోణంలో చర్చలు జోరుగా సాగాయి. సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావార్ పేర్లు ప్రధానంగా వినిపించాయి.
కానీ బీజేపీ అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చలు సాగించి చివరకు రేఖా గుప్తాను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. దీనితో గురువారం ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రామ్ లీలా మైదాన్ ముస్తాబవుతోంది. ఎన్నేళ్లకు పెద పండుగ వచ్చే అనే తరహాలో ఢిల్లీలో కాషాయ జెండా 27 ఏళ్ల తర్వాత ఎగిరింది. అందుకే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. గురువారం సాయంత్రం 4:30 నిమిషాలకు సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ సీఎంగా పర్వేశ్‌వర్మకు అవకాశం కల్పించగా, నూతన మంత్రి వర్గం చేత ప్రమాణం స్వీకారం చేయించాలని పార్టీ నిర్ణయించింది.
రామ్ లీలా మైదాన్ ముస్తాబవుతుండగా, మొత్తం 2 లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు హాజరు కానున్నారు.
రేఖాగుప్తా రాజకీయ ప్రస్థానం..
బీజేపీ ద్వారా రేఖా గుప్తా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007 నుండి 2014 వరకు ఢిల్లీలోని ఉత్తరి పితంపుర వార్డు కౌన్సిలర్‌గా ఆమె కొనసాగారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరి పితంపుర నుంచి వరుసగా రెండోసారి కౌన్సిలర్‌గా విజయాన్ని అందుకున్నారు. 2015 శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. మరల 2020లో కూడా రేఖా గుప్తాకు నిరాశే మిగిలింది.
ఈమె 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకురాలిగా గుర్తింపు పొందిన ఈమెకు ఢిల్లీ పీఠంపై కూర్చునే అవకాశం వచ్చింది. రేఖా గుప్తా బీజేఎల్పీ నేతగా ఎంపిక కావడంతో, బీజేపీ శ్రేణులు, ఆమె అభిమానులు బాణసంచాలు కాలుస్తూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.