BPSC protest Prashant Kishor: బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం పరీక్షా పేపర్ లీక్ వేడి చల్లారడం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిక్షా పేపర్ లీక్ కావడంతో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. గత వారం రోజులుగా విద్యార్థులు బిహార్ రాజధాని పట్నాలో నిరసనలు చేస్తున్నారు. ఆదివారం డిసెంబర్ 29న ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులు ఏకంగా పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులపైనే దాడికి దిగారు. పోలీసులు నిరసనకారులను ఆపడానికి లాఠీ చార్జ్ చేశారు. వాటర్ కేనన్ ప్రయోగించారు.
ఘటనా స్థలంలో విద్యార్థులతో పాటు ఆ సమయంలో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. దీంతో పోలీసులు విద్యార్థులతో పాటు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 621 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వీరిలో 21 పేర్లు నమోదు చేయబడ్డాయి, మిగతా 600 మంది పేర్లు నమోదు కాలేదు.
పట్నా నగరంలోని గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న 21 పేర్లు ఇలా ఉన్నాయి.
ప్రశాంత్ కిషోర్ , ఆయన ఇద్దరు బాడీగార్డులు (బౌన్సర్లు)
మనోజ్ భారతి – జన్ సురాజ్ పార్టీ నాయకుడు
రహ్మాన్షు మిశ్రా – విద్యార్థుల కోచింగ్ డైరెక్టర్
నిఖిల్ మణి తివారి – విద్యార్ధి
శుభాష్ కుమార్ ఠాకుర్ – విద్యార్ధి
శుభం స్నేహిల్ – విద్యార్థి
ఆనంద్ మిశ్రా – విద్యార్థి
రాకేష్ కుమార్ మిశ్రా – విద్యార్థి
విష్ణు కుమార్ – విద్యార్థి
సుజీత్ కుమార్ – సునామీ కోచింగ్ సిబ్బంది
కేసు వివరాల ప్రకారం.. డిసెంబర్ 28, 2024 శనివారం సాయంత్రం 5.30 గంటలకు జన్ సురాజ్ పార్టీ గాంధీ మైదాన్ లోని గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులతో మహాసభ ఏర్పాటు చేయాలని ప్రయత్నిచింది. కానీ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేకున్నా.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 29, 2024 ఆదివారం గాంధీ మైదాన్ లో విద్యార్థులంతా భారీ సంఖ్యలో సమావేశమయ్యారు. అక్కడికి జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిశోర్, ఇతర పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. వారంతా అక్కడి నుంచి బయలు దేరి జెపి గోలాంబర్ ప్రదేశంలోని ముఖ్యమంత్రి నివాసం వద్దకు ర్యాలీలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Also Read : దిగజారుడు రాజకీయాలు.. మన్మోహన్ అంత్యక్రియల్లో మోడీ పబ్లిసిటీ.. కాంగ్రెస్ ఆరోపణలు
అయితే పోలీసులు అందుకు అనుమతించలేదు. అయినా నిరసన చేస్తున్న విద్యార్థులు బయలుదేరుతుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. అడ్డుగా ఉన్న బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లి పోలీసుల చేతిలోని స్పీకర్లను ధ్వంసం చేశారు. ఇంతలో అక్కడికి కలెక్టర్ ఆఫీసులోని అధికారులు వచ్చి వారికి హెచ్చరించడంతో వారితో వాగ్వాదం చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. నిరసన చేస్తున్న విద్యార్థులు కూడా పోలీసులు, అధికారులపై దాడులు చేశారు.
ఆ తరువాత కూడా విద్యార్థులంతా కలిసి వెళ్లి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంటిని చుట్టుముట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలసి పోలీసులు చీఫ్ సెక్రటరీతో చర్చించే అవకాశం కల్పించారు. అయిదు మంది విద్యార్థులు కలిసి వస్తే.. బిహార్ చీఫ్ సెక్రటరీతో చర్చలు జరిపే అవకాశముందని పోలీసులు వెల్లడించారు.
ఈ విషయంపై జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ విద్యార్థులకు సూచనలు చేశారు. ప్రస్తుతానికి నిరసనలు ఆపేసి.. చీఫ్ సెక్రటరీతో చర్చలు జరపాలని సూచించాడు. ఒకవేళ చీఫ్ సెక్రటరీ సరైన రీతిలో స్పందిచకపోతే సోమవారం ఉదయం మళ్లీ అందరూ కలిసి నిరసన చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే తాను తప్పకుండా పోరాటానికి సిద్దమని అన్నారు.
కానీ విద్యార్థులు ప్రశాంత్ కిషోర్ పై మండిపడ్డారు. తాము కేవలం ముఖ్యమంత్రితోనే చర్చలు చేస్తామని చీఫ్ సెక్రటరీతో చర్చలు అవసరం లేదని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
లాఠీ చార్చ్.. వాటర్ కేనన్స్..
విద్యార్థులపై లాఠీ చార్జి గురించి మీడియాతో పట్నా సెంట్రల్ ఎస్‌పి స్వీటీ సహ్రాశాత్ మాట్లాడారు. “విద్యార్థులు తమ స్పీకర్లు నాశనం చేశాక వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించాం. కానీ వందల సంఖ్యలో విద్యార్థులు మీద పడిపోయారు. కానీ మేము వారిపై లాఠీ చార్జ్ చేయలేదు. కేవలం వాటర్ కేనన్ ప్రయోగించాం. అయినా వారంతా పూర్తిగా అక్కడి నుంచి కదల్లేదు. దీంతో మేమే రంగంలోకి దిగి.. ముందువరుసలో ఉన్న ప్రముఖ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నాం. ఆ స్థలం ఖాళీ చేయించడానికి అలా చేయాల్సి వచ్చింది.” అని ఎస్‌పి స్వీటీ తెలిపారు.
నిరసనలకు కారణాలు ఇవే..
బిహార్ రాష్ట్రంలో 70వ ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (CCE) ప్రిలిమ్స్ పరీక్షని ఈ సంవత్సరం నిర్వహించారు. కానీ పేపర్ లీక్ జరిగిందని చాలా మంది ఆరోపణలు చేశారు. దీంతో పరీక్ష మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగానే గర్దానీ బాగ్ లో చాలా రోజులుగా నిరసనలు చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఒక ఎగ్జామ్ సెంటర్ నుంచే పేపర్ లీక్ జరిగిందని అందుకే అక్కడ మాత్రమే రీ ఎగ్జామిషేన్ నిర్వహిస్తామని చెప్పారు. దీనికి విద్యార్థులు అంగీకరించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు.