Modi Show At Manmohan Funeral: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సమయంలో బిజేపీ దిగిజారుడు రాజకీయాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అంత్యక్రియల కార్యక్రమంతా మహా రాజకీయ వేత్తను అవమానించిందని ఎక్కడ చూసినా నిర్వహణా లోపమని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
శనివారం డిసెంబర్ 27, 2024న దేశ రాజధాని ఢిల్లీలోని నిగం బోధ్ ప్రాంతంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఈ మన్మోహన్ సింగ్ పార్థివ్ దేహానికి అందరూ వీడ్కోలు పలికారు. అయితే ఈ అంత్యక్రియల కార్యక్రమంలో కూడా అధికార పార్టీ దివంగత మన్మోహన్ సింగ్ పట్ల అగౌరవంగా ప్రవర్తించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేడా ఆరోపణలు చేశారు.
“ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. కానీ ఈ కార్యక్రమంలో మీడియా తరపున కేవలం దూరదర్శన్ సిబ్బందిని మాత్రమే అనుమతించారు. కార్యక్రమంలో నామమాత్రంగా మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని చూపించి.. ఫోకస్ మొత్తం నరేంద్ర మోడీ, అమిత్ షా పై పెట్టారు. మాజీ ప్రధాని పార్థివ దేహానికి సమీపంలో కేవలం మూడు కుర్చీలు మాత్రమే పెట్టారు. అక్కడ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు కూర్చోవాల్సి ఉంది. వారిని చూద్దామనుకున్న దేశ ప్రజలకు కేవలం మోడీ, షాలు ముఖాలు మాత్రమే బలవంతంగా చూపించారు. కార్యక్రమం అంతా నిర్వహణా లోపాలు స్పష్టంగా కనిపించాయి.
Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..
జాతీయ జెండా మన్మోహన్ సింగ్ సతీమణి చేతికి ఇచ్చిన సమయంలో కానీ, మాజీ ప్రధానికి తుపాకులతో నివాళులర్పించినప్పుడు కానీ నరేంద్ర మోడీ, ఆయన మంత్రులు లేచినిలబడ లేదు. మనోహన్ సింగ్ చితి వద్ద నిలబడడానికి ఆయన భార్య, పిల్లలకు సరిగా చోటు కూడా ఇవ్వలేదు. చితికి ఒకవైపంతా సైనికులు ఆక్రమించుకున్నారు. ప్రజలనైతే దివంగత మాజీ ప్రధాని చివరి చూపు లేకుంగా దూరంగా నిలుచో బెట్టారు.
మన్మోహన్ కుటుంబ సభ్యుల కార్లు లోపలికి రాకుండా చేశారు. కానీ అమిత్ షా సిబ్బంది కార్లు మాత్రం లోపలి వరకు వచ్చాయి. నిగం బోధ్ గేట్లు మూసివేయడంతో మన్మోహన్ కుటుంబ సభ్యులు బయటే ఆగిపోవాల్సి వచ్చింది. తరువాత చాలా ఆలస్యంగా వారిని లోపలికి అనుమతించారు. ఇతర దేశాల రాజకీయ నాయకులు దౌత్యవేత్తలకు సుదూరంగా కూర్చోబెట్టారు. షాకింగ్ విషయమేమిటంటే భూటాన రాజు మన్మోహన్ చివరి చూపు కోసం వస్తే.. ప్రధాని మోడీ లేచి నిలబడ లేదు. బిజేపీ నాయకులు తీరు దివంగత మన్మోహన్ లాంటి నాయకుడికి అవమానకరంగా భావించాలి.” అని పవన్ ఖేడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రతినిధి జై రామ్ రమేష్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ కూడా బిజేపీ ప్రభుత్వంపై మన్మోహన్ సింగ్ అంత్యక్రియల అంశంలో దాడి చేశారు. ప్రధాన మంత్రుల దహన సంస్కారాల కోసం కేటాయించిన స్థలంలో కాకుండా మరో చోట అంత్యక్రియలు నిర్వహించడంతో దివంగత నాయకుడిని బిజేపీ అవమానించిందని రాహుల్ ఆరోపించారు.
అయితే బిజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను ఖండించారు. మాజీ ప్రధాని చనిపోయి అందరూ విషాదంలో ఉంటే ఈ సమయంలో కూడా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే రాజకీయాలు చేస్తున్నారని.. వారి చర్యలను ఎంత ఖండించినా సరిపోదని ఎద్దేవా చేశారు.