CBSE 10th And 12th Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి జులై 15 మధ్య బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి, 12వ తరగతి బోర్డు మెయిన్ పరీక్షలు రెండూ ఫిబ్రవరి 17, 2026 నుండి ప్రారంభమవుతాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 9, 2026న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9, 2026న ముగుస్తాయి. ఈ పరీక్షలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయి. కొన్ని సబ్జెక్టులకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు-2.. మే 15, 2026 నుంచి ప్రారంభమవుతాయి.
CBSE ప్రకారం భారతదేశంతో పాటు 26 దేశాలలో 204 సబ్జెక్టులలో సుమారు 45 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. రాత పరీక్షలతో పాటు, ఫలితాల ప్రకటనను సకాలంలో నిర్ధారించడానికి ప్రాక్టికల్స్, మూల్యాంకనం, ఫలితాల తర్వాత ప్రక్రియలు ముందుగానే ప్రకటిస్తుంది సీబీఎస్ఈ.
సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి సబ్జెక్టు పరీక్షకు దాదాపు 10 రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. 12 రోజుల్లోపు మూల్యాంకనం పూర్తిచేస్తారు. అయితే ఈ డేట్ షీట్లు తాత్కాలికమేనని, పాఠశాలలు విద్యార్థుల తుది జాబితాను సమర్పించిన తర్వాత మార్పు చేర్పులు ఉంటాయని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బోర్డు పరీక్షలు రెండుసార్లు నిర్వహించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. పదో తరగతి మొదటి ఎడిషన్ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6, 2026 వరకు నిర్వహించనున్నారు. రెండో ఎడిషన్ మే 15 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయని CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. మే నెలలో జరగనున్న రెండో దశ తమ పనితీరును మెరుగుపరచుకోవాలనుకునే విద్యార్థులకు ఆప్షనల్ అన్నారు. ఒక విద్యార్థి రెండు దశలకు హాజరైనట్లయితే, రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
రెండు పరీక్షలు పూర్తి సిలబస్‌పై నిర్వహించనున్నారు. ఇక ప్రత్యేకంగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించమని బోర్డు స్పష్టం చేసింది. అయితే రెండో సెషన్ పరీక్షలు స్కోర్‌లను మెరుగుపరచుకోవాలనుకునే వారికి సప్లిమెంటరీ పరీక్షగా ఉపయోగపడుతుందని పేర్కొంది.
Also Read: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9, 2026 వరకు నిర్వహించనున్నారు. బోర్డు మార్గదర్శకాల ప్రకారం ప్రతి సబ్జెక్టు పరీక్ష నిర్వహించిన దాదాపు 10 రోజుల తర్వాత మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు 12వ తరగతి ఫిజిక్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 20, 2026న షెడ్యూల్ చేస్తే మూల్యాంకనం మార్చి 3, 2026న ప్రారంభమై మార్చి 15, 2026 నాటికి ముగిసే అవకాశం ఉందని భరద్వాజ్ తెలిపారు.