CBSE Exams : 10 వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చేందుకు సీబీఎస్సీ బోర్డు సిద్ధమైంది. 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆమోదించింది. ఈ కొత్త నిబంధనలను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. మార్చి 9 వరకు అందరు వాటాదారులు… అంటే పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇతరుల (సాధారణ ప్రజలు మొదలైనవి) వారి అభిప్రాయాల్ని తెలియజేయాలని CBSE వెబ్‌సైట్‌లో పోస్టుచేసింది. అభిప్రాయాలు తెలపాలని సూచించింది. మోజార్టీ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేయాలా, ఏదైనా మార్పు చేర్పులు చేయాలా అనే విషయమై తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతానికి బోర్డు వెల్లడించిన ముసాయిదా నిబంధనల ప్రకారం మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు, రెండో దశ పరీక్షలను మే 5 నుంచి 20 వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే.. స్టేట్ బోర్డులలా సగం సబ్జెక్టులపై ఒకసారి, మరికొంత సిలబస్ పై ఇంకో సారి నిర్వహించడం ఉండదని స్పష్టం చేసింది. రెండు దశల్లోనూ పూర్తి సిలబస్ పై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే.. ప్రాక్టికల్, ఇంటర్నల్ ఎసెస్మెంట్ మాత్రం ఒక్కసారే నిర్వహించనున్నారు. అలాగే.. తొలిసారి ఏ పరీక్షా కేంద్రాన్ని విద్యార్థులకు కేటాయిస్తారో, రెండో సారి కూడా అదే కేంద్రంలో పరీక్ష ఉంటుందని తెలిపింది. పరీక్ష ఫీజులు సైతం పెంచనున్నట్లు వెల్లడించింది.
ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యే విద్యార్థుల కోసం రెండు దశల్లోనూ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపిన సీనియర్ అధికారులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు ప్రత్యేక పరీక్షలు నిర్వహించదని స్పష్టం చేశారు. CBSE ఏటా బహుళ బోర్డు పరీక్షలను అమలు చేయాలని ప్రణాళికలు ప్రకటించింది. దీని వలన విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాసి.. వారి బెస్డ్ స్కోరును కొనసాగించొచ్చు అని తెలిపింది. తాజాగా బోర్డు ప్రకటించిన సంస్కరణ జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అంటున్న అధికాకరులు.. ఇది విద్యార్థుల సామర్థ్యాల్ని మరింత మెరుగుపరుస్తాయి అంటున్నారు.
పరీక్షలంటే ఆందోళన చెందే విద్యార్థులు, అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే.. జాతీయ విద్యా విధానంలోని సమ్మిళిత లక్ష్యానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని బోర్డు అభిప్రాయపడింది. ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలకు అవకాశం కల్పించడం ద్వారా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు న్యాయమైన అవకాశం లభిస్తుందంటున్నారు. ఈ మార్పులకు అలవాటు పడేలా, పేపర్ కరెక్షన్ సైతం సరిగ్గా నిర్వహించేందుకు CBSE బోర్డు అన్ని చర్యలు చేపడుతుందన్న అధికారులు.. ఈ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.