Citroen 2 CV Concept: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన పాత ఐకానిక్ మోడల్‌కు లేటెస్ట్ లుక్ తీసుకొస్తోంది. 2026 పారిస్ మోటార్ షోలో సిట్రోయెన్ 2 CV కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. రెట్రో డిజైన్‌తో పాటు ఆధునిక టెక్నాలజీని కలిపి రూపొందించిన ఈ కాన్సెప్ట్.. భవిష్యత్తులో రానున్న చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌కు టీజర్ గా నిలువనుంది. ఈ కారు ప్రొడక్షన్ వెర్షన్‌ను 2028లో విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు 15,000 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 16 లక్షలు ఉండొచ్చని అంచనా.
అసలు సిట్రోయెన్ 2 CV మోడల్‌ను 1948లో పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపు 78 ఏళ్ల తర్వాత అదే పేరుతో కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. పాత మోడల్‌లోని ప్రత్యేకమైన బాడీ డిజైన్‌ను కొనసాగిస్తూనే ఆధునిక స్టైలింగ్‌ను జోడించారు. ఈ కాన్సెప్ట్ పొడవు 3.76 మీటర్లు. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు.
ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్స్, రౌండ్ DRLలు, ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్ కనిపిస్తాయి. బోనెట్‌పై V ఆకారపు డిజైన్ పాత 2 CV మోడల్‌ను గుర్తు చేస్తుంది. విండ్ స్క్రీన్‌పై ఉన్న 1948, 1990, 2026 సంఖ్యలు అసలు మోడల్ ప్రారంభం, దాని ఉత్పత్తి ముగింపు, కొత్త కాన్సెప్ట్ ఆవిష్కరణను గుర్తు చేయనున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో వంపులతో కూడిన రూఫ్‌లైన్, నల్లటి వీల్ ఆర్చ్‌లు, 18 అంగుళాల స్టీల్ వీల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు, నల్లటి టెయిల్‌గేట్, వెండి రంగు యాక్సెంట్లు ఉన్నాయి. టైర్ల పరిస్థితిని మానిటర్ చేసేందుకు మిషెలిన్ అభివృద్ధి చేసిన డిజిటల్ టెక్నాలజీని కూడా ఈ కాన్సెప్ట్‌లో ప్రస్తావించారు.
ఈ కారు ఇంటీరియర్ సంప్రదాయ మోడళ్లకు భిన్నంగా ఉంటుంది. తెలుపు, పసుపు రంగుల కలయికతో క్యాబిన్‌ను రూపొందించారు. టార్టాన్ పసుపు అప్హోల్స్టరీతో బెంచ్ తరహా సీట్లు అందించారు. డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌కు సాధారణ లుక్ లో లేకుండా ఎక్కువ స్థలం ఉన్న అనుభూతిని కలిగించేలా డిజైన్ చేశారు. స్టీరింగ్ వీల్ సమీపంలో కంట్రోల్ లివర్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. సెంటర్ కన్సోల్ స్థానంలో రిమూవబుల్ స్టోరేజ్ బాస్కెట్‌ను ఇచ్చారు. ఫ్యాబ్రిక్ సన్‌రూఫ్, వేరు చేసి స్పీకర్‌లా ఉపయోగించగల రేడియో యూనిట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ పై కుందేలు, తాబేలు సింబల్స్ ఉన్నాయి.
ప్రొడక్షన్ వెర్షన్ సిట్రోయెన్ అమీ, C3 మోడళ్ల మధ్య స్థానంలో ఉండనుంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్, మోటార్ పవర్ వంటి పూర్తి టెక్నికల్ వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.
Read Also: లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!