PM Modi Visits Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తామంటూ ప్రధాని భరోసా ఇచ్చారు.
వయనాడ్ లో పర్యటించిన తరువాత అక్కడి పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. కొండచరియలు విరిగిపడిన రోజే సీఎం పినరయి విజయన్ తో తాను మాట్లాడానన్నారు. ప్రకృతి విలయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తు సాధారణమైనది కాదు.. వేలాది కుటుంబాల కలలు కల్లలుగా మారాయంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితిని చూశాను.. బాధితులను కలిశాను.. మృతుల కుటుంబాలకు అండంగా ఉంటామంటూ మోదీ హామీ ఇచ్చారు. వయనాడ్ లో పరిస్థితి మెరుగుపడేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Also Read: వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ
కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ విపత్తులో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని వెంట సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.