Chennai Airport Flight | చెన్నై ఎయిర్‌పోర్టులో తృటిలో విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ల్యాండ్ చేసే క్రమంలో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులందరూ భయందోళనకు గురయ్యారని సమాచారం.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ భారీ అల్పపీడనం వల్ల ఫెంగల్ తుఫాను శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షలు కురుస్తుండడంలో తమిళనాడు రాష్ట్రానికి రాకపోకలు బంద్ అయ్యాయి. తుఫాన్ కారణంగా చెన్నై ఎయిర్‌పోర్ట్ కూడా కొన్ని గంటపాటు కార్యకలాపాలు నిలిపివేసింది. విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో విమానం ప్రమాదానికి గురవుతూ తృటిలో తప్పించుకుంది.
ఎయిర్ పోర్ట్ రన్‌వేపై ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో భారీ ఈదురుగాలులు ఉండడంతో విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ల్యాండింగ్ సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపాడు. ల్యాండింగ్ చేసే క్రమంలో భారీగా ఈదురు గాలులు ఉండడం వల్ల విమానం వెనుక భాగం రన్‌వేకు బలంగా తాకే ప్రమాదం పసిగట్టిన పైలట్ వెంటనే విమానాన్ని పైకి లేపాడు. గాల్లోనే కాసేపు చక్కర్లు కొట్టి.. ఆ తరువాత సురక్షితంగా రన్ వేపై ల్యాండ్ చేశాడు. చివరికి విమానంలోని ప్రయాణికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.
భారతదేశంలోని దక్షిణది రాష్ట్రాల్లో శనివారం ఫెంగల్ తుఫాను తాకింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులు కార్యకలాపాలు ఆదివారం ఉదయం 4 గంటల వరకు నిలపివేశారు. కానీ తుఫాను చెన్నై నగరాన్ని దాటిసేందని వాతావరణ శాఖ తెలపడంతో రాత్రి ఒంటి గంటకే తిరిగి విమానాల రాకపోకలు ప్రారంభించారు. మధ్యలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో చాలామంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. తుఫాను కారణంగా చాలా అంతర్జాతీయ విమానాలు ఇతర నగరాలకు మళ్లించాల్సి వచ్చింది.
మరోవైపు ఫెంగల్ తుఫాను వల్ల తమినాడు, పుదుచ్చేరితో పాటు శ్రీలంకలో భారీ బిభత్సం జరిగింది. తమిళనాడులో తిరువల్లూర్ , నాగపట్టణం ప్రాంతాల్లో నుంచి 470 మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించి శరణార్థి శిబిరాలకు తరలించారు. శ్రీలంకలో ఇప్పటివరకు 15 మంది మరణించారని సమాచారం. మొత్తం 4.5 లక్షల మంది తుఫాను వల్ల నిరాశ్రయులయ్యారని స్థానిక మీడియా తెలిపింది.