మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన సర్వేలో దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై వివరాలు సేకరించారు. ఈ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు మూడో స్థానంలో నిలవడం విశేషం. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఈ సర్వే జరిగింది. ఇందులో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మొదటి స్థానం లభించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రెండో స్థానం దక్కగా, ఏపీ సీఎం చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగికి 36 శాతం జనామోదం లబించింది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న మమతకు 12.5 శాతం ఓట్లు లభించాయి. చంద్రబాబుకి 7.3 శాతం మంది ప్రజలు జై కొట్టారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ 4.3 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉండగా, తమిళనాడు సీఎం స్టాలిన్ 3.8 శాతం ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు ఐదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు తన ర్యాంకు మెరుగు పరచుకున్నారు. మూడో స్థానానికి చేరుకున్నారు.
ఆస్తుల్లో చంద్రబాబు మొదటి స్థానం..
ఇక ముఖ్యమంత్రుల ఆస్తులపై కూడా ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు రూ.332.56 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో కర్నాటక, నాగాలాండ్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ముఖ్యమంత్రులు దేశంలో ముగ్గురు ఉన్నారు. రూ.11కోట్ల కంటే ఎక్కువ, రూ.50కోట్ల కంటే తక్కువ ఆస్తి కలిగి ఉన్నవారు 9మంది ఉన్నారు. కోటి రూపాయల నుంచి 11 కోట్ల రూపాయల మధ్య ఆస్తి ఉన్నవారు 16మంది ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు కేవలం రూ.15లక్షలు. ఆమె కంటే ముందు స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తి కలిగి ఉన్నారు. కనీసం కోటి రూపాయల ఆస్తులు కూడా లేని ముఖ్యమంత్రులు దేశంలో వీరిద్దరే.
టెన్త్ పాస్ సీఎం ఒకే ఒక్కరు..
ముఖ్యమంత్రుల వయసు, విద్యార్హతలపై కూడా ఈ సర్వే జరిగింది. ఇందులో కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయిన సీఎం ఒకే ఒక్కరు ఉన్నారు. డిప్లొమా వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన వారు ముగ్గురు, డిగ్రీ చదివిన వారు 9మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 8మంది, డాక్టరేట్ కూడా సాధించిన వారు ఇద్దరు ఉన్నారు.
యంగెస్ట్ సీఎం
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, మేఘాలయ సీఎం సీకే సంగ్మా ఇద్దరూ దేశంలోనే అత్యంత పిన్న వయసు ముఖ్యమంత్రులు. కేరళ సీఎం పినరయి విజయన్ అత్యంత వృద్ధ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాత్రమే మహిళలు.