Pressure Cooker: ఇంట్లో వంట చేయడానికి పాత ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగిస్తున్నారా ? అయితే.. అది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రెషర్ కుక్కర్ పాతబడినప్పుడు లేదా పాడైనప్పుడు, అది ఆహారంలోకి సీసం వంటి హానికరమైన లోహాలను విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాత ప్రెషర్ కుక్కర్ వల్ల కలిగే నష్టాలు:
ప్రెషర్ కుక్కర్ పాతబడినప్పుడు, అది ఆహారంలోకి సీసాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరంలో నుంచి సులభంగా బయటకు వెళ్లదు. అది మీ ఎముకలు, రక్తం, మెదడులో పేరుకుపోతుంది. దీనివల్ల మీరు నిస్సత్తువగా అనిపించడం, నరాలు బలహీనపడటం, కాలక్రమేణా జ్ఞాపకశక్తి , మానసిక స్థితి ప్రభావితం కావడం వంటి సమస్యలు వస్తాయి.
పిల్లలకు మరింత ప్రమాదం:
చిన్న పిల్లల్లో సీసం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారి మెదడు అభివృద్ధిని మందగింపజేయడమే కాకుండా.. ఐక్యూ (IQ) స్థాయిని కూడా తగ్గిస్తుంది. వయసు పెరిగే కొద్దీ, కుక్కర్ లోపల గీతలు లేదా నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు, అది ఆహారంలోకి సీసం , అల్యూమినియం వంటి లోహాలను విడుదల చేస్తుంది. సీసం శరీరంలో పేరుకుపోవడం చాలా ప్రమాదకరమైంది.
మీ కుక్కర్‌ను ఎప్పుడు మార్చాలి ?
మీరు మీ ప్రెషర్ కుక్కర్‌ను మార్చడానికి కొన్ని సూచనలు ఉన్నాయి.
గీతలు లేదా నల్లటి మచ్చలు: కుక్కర్ లోపల నల్లటి మచ్చలు లేదా గీతలు కనిపిస్తే అది మార్చడానికి సరైన సమయం.
వదులుగా ఉన్న మూత లేదా విజిల్: మూత లేదా విజిల్ వదులుగా ఉంటే.. అది ప్రమాదానికి దారితీస్తుంది.
లోహపు వాసన: ఆహారం వండినప్పుడు తాజా వాసనకు బదులుగా లోహపు వాసన వస్తుంటే.. అది ప్రమాదకరమైనది.
Also Read: మీలో ఈ లక్షణాలున్నాయా? కాల్షియం లోపం కావొచ్చు !
నివారణ చర్యలు:
ఆరోగ్య సమస్యలు రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం మంచిది. వంట పాత్రలను సమయానికి మార్చాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
పదేళ్ల కంటే పాత కుక్కర్‌ను ఉపయోగించడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ కుటుంబ ఆరోగ్యం కోసం, వంటపాత్రలను ఎప్పటికప్పుడు చెక్ చేసి, అవసరమైనప్పుడు మార్చడం చాలా ముఖ్యం.