Chhattisgarh: మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. హింసకు పాల్పడుతున్నారు. లేటెస్ట్‌గా ఛత్తీస్‌ఘడ్‌లో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. సర్పండ్ అభ్యర్థిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం ఆ రాష్ట్రమంతా సంచలనంగా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సేను అతి కిరాతకంగా హత్య చేశారు మావోయిస్టులు. గురువారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల ఎదుటే అతడి గొంతు కోశారు. ఈ ఘటనను చూసి జోగా ఫ్యామిలీతోపాటు ఇరుగుపొరుగు వాళ్లు షాకయ్యారు.
గతంలో సీపీఐలో ఉండేవాడు. అయితే కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు జోగా. పార్టీ మారడం ఇష్టం లేక ఈ పని చేసి ఉండవచ్చని అంటున్నారు. గడిచిన రెండు రోజుల్లో దంతేవాడ, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు గ్రామస్తులను హతమార్చారు.
మంగళవారం రాత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకడి గ్రామంలో మరో ఘోరం జరిగింది. అర్థరాత్రి కాకడి గ్రామానికి చేరుకున్న మావోయిస్టుల బృందం, హర్మ హేమ్లా ఇంట్లోకి చొరబడ్డారు. అతడ్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత అతడ్ని గొంతు కోసి చంపారు.
ALSO READ: ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు బిజేపీ ఆఫర్.. ఓటమి భయంతోనే ఇదంతా
గ్రామస్తుల ద్వారా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హేమ్లా పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మావోలు భావించినట్టు తేలింది. ఫిబ్రవరి 3న బీజాపూర్‌లోని టార్రెమ్ పోలీసు పరిధిలోని బుడ్గిచెరు గ్రామంలో నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన సాయుధ వ్యక్తులు ఇద్దరు గ్రామస్తులను హత్య చేశారు.
చంపబడిన పౌరులను తలబ్బర నివాసి రాజు కర్రెమ్, మడావి మున్నాగా గుర్తించారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ వీరిని పదునైన ఆయుధాలతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కొద్దిరోజులుగా ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో మావోయిస్టులు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మావోల ప్రభావం క్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులను చంపడంతో అటవీవాసులు హడలిపోతున్నారు.