Amit Shah : రాజ్యాంగాన్ని స్వీకరించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యాలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అమిత్ షా.. అంబేద్కర్ ను అవమానించారని, ఆయనకు కేంద్ర మంత్రిగా పనిచేసే అర్హత లేదంటూ విపక్ష పార్టీల నేతలు తీవ్ర నిరసనలకు దిగుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో విమర్శనాస్త్రంగా వాడుతుండగా.. మరోవైపు రాష్ట్రాల స్థాయిలోనూ అంబేద్కర్ వాదుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమిత్ షాకు రాజ్యాంగంపై, అంబేద్కర్ పై గౌరవం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ.. అంబేడ్కర్‌ను అవమానిస్తే దేశం సహించదని పేర్కొన్నారు. అంబేద్కర్ పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్ని చేపట్టింది. పార్టీ ఎంపీలంతా కలిసి అంబేద్కర్ ఫోటోలతో పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు
సోషల్ మీడియాలో అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ నేతలు పోస్టులు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడైన అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారు. పార్లమెంట్ లోనే ఆయనను, ఆయన రూపుదిద్దిన రాజ్యాంగాన్ని అవమానించడాన్ని దేశం సహించదంటూ పోస్ట్ చేశారు. భారత్ లో అంబేడ్కర్ పేరు ప్రస్తావించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారని, కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవాలకు అంబేద్కర్ ప్రతీక అని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు.
షా వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. అమిత్ షా ను 24 గంటల్లో కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆ పార్టీ నాయకులకు రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలపై గౌరవం లేదన్న ఖర్గే.. దేశంలో మనుస్మృతిని అమలు చేయాలని చూస్తూన్నారని అన్నారు. హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. ఖండించాల్సిన ప్రధాని.. మద్ధతుగా ఆరు ట్వీట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమిత్ షా- మోదీ ప్రాణమిత్రులని వారిద్దరు ఒకరి పాపాల్ని మరొకరు పంచుకుంటారని వ్యాఖ్యానించారు. 0ఒక వ్యక్తి రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మంత్రి అయ్యి, రాజ్యాంగాన్ని అవమానిస్తే అతనికి మంత్రివర్గంలో ఉండే హక్కు లేదు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని హెచ్చరించారు.
ప్రతిపక్ష నేతలు ఏమన్నారు..
అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. అంబేడ్కర్ మార్గదర్శకత్వం, స్ఫూర్తిబాటలో నడిచే లక్షలాది మందికి ఈవ్యాఖ్యలు అమానకరమన్నారు. షా ప్రస్తుత మాటలతో ఆ పార్టీ ముసుగు తొలిగిపోయిందని.. ద్వేషంతో నిండిన ఆ పార్టీ నుంచి ఇంతకంటే ఇంకేమి ఆశించగలమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. భాజపా మిత్రపక్షాలు అమిత్ షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంబేద్కర్ పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఆయన సేవల్ని గౌరవించడంలో ఈ పార్టీల నేతలు విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలోనే దిల్లీ ఎన్నికల జరగనున్న.. బీజేపీ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ వ్యాఖ్యలతో మరిన్ని విమనాస్త్రాలు దొరికినట్లైంది. తనకు లాగానే అంబేద్కర్ దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆదర్శమని దిల్లీ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బాబా సాహెబ్‌ను అవమానించడం ద్వారా దేశంలోని కోట్లాది ప్రజల మనోభావాలను అమిత్ షా దెబ్బతీశారని అన్నారు. హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో బాబా సాహెబ్‌ను అవమానించడమే కాకుండా.. ఆయనను తమ ఆరాధ్య దైవంగా భావించే కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీశారంటూ దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read : ఓటింగ్‌కు 20 బిజేపీ ఎంపీలు గైర్హాజరు.. చర్యలకు సిద్దమవుతున్న కమలం పార్టీ
అమిత్ షా ఏమన్నారంటే..
రాజ్యంగంపై చర్చలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా.. దేశంలో ఇప్పుడు అంబేద్కర్ పేరు చేప్పి నిరసనలు చేయడం అలవాటుగా మారిందని అన్నారు. చీటికీమాటికి అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అనే బదులు.. దేవుడి పేరును స్మరిస్తే వారికి స్వర్గంలో చోటైనా లభిస్తుంది అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంతో విభేదించిన కారణంగానే బీఆర్ అంబేద్కర్ మొదటి మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న అమిత్ షా.. అంబేద్కర్ కూడా నెహ్రూ ప్రభుత్వ విధానాలతో, ఆర్టికల్ 370పై నెహ్రూ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారంటూ రాజకీయ దుమారం చెలరేగింది.