
CPR to Snake : హార్ట్ బీట్ సడెన్‌గా ఆగినప్పుడు అటు డాక్టర్లైనా.. మాములుగా ఫస్ట్ ఎయిడ్ తెలిసిన వారైనా చేసేది సీపీఆర్. సీపీఆర్ చేస్తూ ఆక్సిజన్ అందించి తిరిగి ప్రాణం పోస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఇలా సీపీఆర్ చేసి ఓ ప్రాణం కాపాడాడు. అయితే అతను కాపాడింది మనిషి ప్రాణం అనుకుంటే మీరు పొరబడినట్టే. అతను కాపాడింది తన కాటుతో మనుషుల ప్రాణాలు తీసే ఓ పాము ప్రాణం.
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఈ ఘటన జరిగింది. ఓ రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న పైప్‌లైన్‌లోకి ఈ పాము చొరబడింది. దానిని బయటికి రప్పించేందుకు అందులోకి ఓ క్రిమిసంహారక మందును వదిలారు. పాము అయితే బయటికి వచ్చింది కానీ.. స్పృహ తప్పిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ అతుల్ శర్మ వెంటనే పాముకు సీపీఆర్ చేసి రక్షించాడు. పామును పట్టుకుని పరీక్షించిన అతను, దాని శ్వాసను చెక్ చేశాడు. ఆ తర్వాత ఆ పాము నోట్లోకి గాలి ఊదాడు. దీంతో దెబ్బకు లేచి కూర్చుంది ఆ పాము.
కానిస్టేబుల్ అతుల్ శర్మ గడిచిన 15 ఏళ్లలో సుమారు 500 పాముల్ని పట్టుకున్నాడు. తాను బతికించిన పామును తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. అయితే పాముకు సీపీఆర్ చేయడం సాధ్యం కాదని.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాము కొద్ది సేపటి తర్వాత లేచి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా పామును కాపాడేందుకు అతని ప్రయత్నాన్ని మాత్రం అభినంచాల్సిందే.